2021లో భారత్‌ వృద్ధి 12.5 శాతం! 

IMF ups Indias FY22 GDP Growth Forecast To 12.5 Percent - Sakshi

2021పై ఐఎంఎఫ్‌ అంచనా 

2022లో 6.9 శాతానికి పరిమితం

వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్‌ తిరిగి సాధించగలుగుతుంది. కాగా 2022లో భారత్‌ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది.  కోవిడ్‌–19 మహమ్మారి సవాళ్లలోనూ 2020లో వృద్ధి సాధించిన పెద్ద ఎకానమీగా చైనా నిలబడిన సంగతి తెలిసిందే. 2020లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం క్షీణించగా,  చైనా 2.3 శాతం వృద్ధి సాధించింది. 2021లో ఆ దేశం 8.6%, 2022లో 5.6 శాతం పురోగతి సాధిస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రపంచబ్యాంక్‌తో కలిసి త్వరలో వార్షిక ‘స్పింగ్‌’ సమావేశాలు నిర్వహించనున్న బహుళజాతి బ్యాకింగ్‌ దిగ్గజం– ఐఎంఎఫ్‌ తాజాగా  వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది.   

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 6 శాతం వృద్ధి 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గత అంచనాలను ఐఎంఎఫ్‌ మెరుగుపరచింది. 2020లో 3.3 శాతం క్షీణించిన గ్లోబల్‌ ఎకానమీ.. 2021, 2022లో వరుసగా 6 శాతం, 4.4 శాతం పురోగమిస్తుందని అంచనావేసింది. 2020 అక్టోబర్‌ నివేదికతో పోల్చితే 2020కి సంబందించి క్షీణత అవుట్‌లుక్‌ 1.1 శాతం మెరుగుపరచింది. 2020 చివరి ఆరు నెలల్లో పలు దేశాల్లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడం దీనికి కారణమని తాజా అవుట్‌లుక్‌ వివరించింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు తగ్గడం వల్ల ఆర్థికరంగం క్రియాశీలత అంచనాలకు మించి మెరుగుపడిందని తెలిపింది. దీనికి అనుగుణంగానే  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను 2021, 2022ల్లో వరుసగా గతంకన్నా 0.8 శాతం, 0.2 శాతం మెరుగుపడినట్లు వివరించింది.  చదవండి: (అదానీ గ్రూప్‌ సరికొత్త రికార్డ్‌)

ఆరోగ్యరంగంపై భారీ వ్యయాలు 
అవుట్‌లుక్‌లోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పర్యాటక రంగమూ మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆరోగ్య రంగంపై అధిక వ్యయాలు చేయాలి. హెల్త్‌కేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుపడాలి. కోవిడ్‌–19 ప్రభావానికి గురైన కుటుంబాలు అలాగే సంస్థలకు ద్రవ్యపరమైన మద్దతు అవసరం. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న దేశాల్లో సరళతర ద్రవ్య విధానాలను కొనసాగించాలి. ప్రతి దేశం ఫైనాన్షియల్‌ స్థిరత్వానికి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. సంక్షోభం ఒక్కసారి ముగిసిన వెంటనే, రికవరీ వేగవంతం, ఉత్పత్తి పెంపుసహా ఆర్థిక వ్యవస్థల పటిష్ట పునర్నిర్మాణానికి తగిన ముందస్తు చర్యలను, వ్యూహాలను ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. పర్యావరణ అనుకూలమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణ మార్పుల ప్రతికూలతలను తద్వారా నివారించుకోవచ్చు. ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి డిజిటల్‌ ఇన్‌ఫ్రాపై పెట్టుబడులను పెంచాలి. అసమానతలను తగ్గించడానికి సామాజిక సహాయ సహకారాలను పటిష్టం చేసుకోవాలి.  

సవాళ్లు పొంచి ఉన్నాయ్‌..
అటు అంతర్జాతీయంగా, ఇటు వివిధ దేశాల్లో అంతర్గతంగా రికవరీ వేగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో ఈ అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. ఇంకా మనం వైరస్‌ను ఓడించలేదన్న విషయాన్ని గమనించాలి. పైగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లే ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి.  ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే తాజా అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం.  
– గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌  

నెల లాక్‌డౌన్‌తో జీడీపీ నష్టం 2 శాతం: బీఓఎఫ్‌ఏ
భారత్‌ ఎకానమీ రికవరీ ఇంకా విస్తృత ప్రాతిపదికన పటిష్టంగా లేదని అమెరికన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బీఓఎఫ్‌ఏ) సెక్యూరిటీస్‌ మంగళవారం హెచ్చరించింది. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి భారత్‌ నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తే, ఎకానమీ 1 నుంచి 2 శాతం వరకూ పతనం అవుతుందని అంచనావేసింది. పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను తిరిగి ప్రకటించనప్పటికీ, రాత్రి పూట కర్ఫ్యూలు, స్థానిక లాక్‌డౌన్‌ విధింపు ద్వారా కరోనా సెకండ్‌ వేవ్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది కూడా ఎకానమీపై ప్రతికూలత చూపే అంశమేనని తెలిపింది.  2021–22లో భారత్‌ ఎకానమీ 9% వృద్ధి రేటును నమోదుచేసుకోవచ్చని అంచనావేసిన సంస్థ, దీనికి ప్రధాన కారణాల్లో బేస్‌ ఎఫెక్ట్‌ (2020–21లో అతి తక్కువ ఎకానమీ గణాంకాలు) ఒకటని తెలిపింది.

సెకండ్‌వేవ్‌తో జీడీపీ నష్టం 0.3 శాతమే: యూబీఎస్‌ 
కోవిడ్‌–19 కేసులు ఫిబ్రవరి నుంచీ తిరిగి పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రాల వ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్‌ విధింపు మరోసారి ఉండబోదన్న అభిప్రాయాన్ని స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ– యూబీఎస్‌ అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్‌ సెకండ్‌వేవ్‌ సమస్య ఉన్నప్పటికీ, దీని ప్రతికూల ప్రభావం ఎకానమీపై 20 నుంచి 30 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) మేర మాత్రమే ఉంటుందని యూబీఎస్‌ విశ్లేషించింది. 2021–22లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం పురోగమిస్తుందన్న తమ సంస్థ అభిప్రాయంలో మార్పులేదని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ తన్వీ గుప్తా జైన్‌ మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్య పరపతి విధానం దాదాపు యథాతథంగా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే రివర్స్‌ రెపో రేటు   25–40 బేసిస్‌ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని తన్వీ అభిప్రాయపడ్డారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top