
భారత్‌తో పెట్టుకుంటే మీకే సమస్య అంటూ చురకలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ నిధులు విడుదల చేసే విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 11 కొత్త షరతులు విధించింది. అలాగే భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది. ఉద్రిక్తతలు పెంచుకొంటే మీకే ఎక్కువ సమస్యలు వస్తాయని తేల్చిచెప్పింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, సంస్కరణ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని తేల్చిచెప్పింది. బిలియన్ డాలర్ల(రూ.8,540 కోట్లు) రుణానికి సంబంధించిన నిధులు పొందాలంటే షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది.
తాజాగా విధించిన 11 షరతులతో కలిపి పాకిస్తాన్‌పై విధించిన ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరుకోవడం గమనార్హం. రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని, విద్యుత్ బిల్లులపై రుణ సరీ్వసింగ్ సర్‌చార్జి పెంచాలని, మూడేళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని ఐఎంఎఫ్ పేర్కొంది. మొత్తం బడ్జెట్‌లో రూ.1.07 ట్రిలియన్ల సొమ్మును అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్దేశించింది. పాక్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలని అమలు చేయాలని తేల్చిచెప్పింది.