
భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ విశ్వాసం
గత అంచనాలు పెంచుతూ నిర్ణయం
న్యూయార్క్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ అంచనాలను ప్రకటించింది. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన అంచనాలను ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచడం గమనార్హం. ఈ ఏడాదికి సంబంధించి 0.2 శాతం, వచ్చే ఏడాదికి 0.1 శాతం మేర తాజా అంచనాల్లో ఎగువకు సవరించింది. ఈ మేరకు తన తాజా నివేదికను విడుదల చేసింది. బలమైన వినియోగానికి.. ప్రభుత్వ పెట్టుబడులకు చురుకైన సంస్కరణలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది.
రానున్న కాలంలో ఈ సానుకూల వృద్ధిని కొనసాగించడం భారత్‌కు ఎంతో కీలకమని ఐఎంఎఫ్ పరిశోధన విభాగం చీఫ్ డెనిజ్ ఇగాన్ పేర్కొన్నారు. వేగంగా ఉపాధి సృష్టి, నైపుణ్యాల కల్పన ద్వారా వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్న కారి్మకులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడంతోపాటు.. మౌలిక వసతులు, వాణిజ్య అడ్డంకులను తొలగించడం భారత్ ముందున్న ప్రాధాన్యతలుగా తెలిపారు. మధ్య కాలానికి భారత్ విద్యపై పెట్టుబడులు పెంచడం, భూ సంస్కరణలు చేపట్టడం, సామాజిక భద్రత కల్పించడం, నిబంధనలు, పాలనా యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించడం కూడా కీలకమేనని పేర్కొన్నారు.
అంతర్జాతీయ వృద్ధి అంచనాలూ పెంపు
వర్ధమాన దేశాల్లో ఆర్థిక వృద్ధి 2025లో 4.1 శాతం, 2026లో 4 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక చైనా ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సైతం 2025 సంవత్సరానికి 0.8 శాతం పెంచి 4.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బలమైన పనితీరుకు తోడు, అమెరికాతో టారిఫ్‌లు గణనీయ స్థాయి నుంచి తగ్గడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. 2026లో 4.2 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం స్వల్పంగా పెంచి 2025లో 3 శాతంగా, 2026లో 3.1 శాతంగా ఉంటుందని పేర్కొంది.