
రూ. 8,000 కోట్లకుపైగా నిధుల విడుదలకు ఐఎంఎఫ్ ఓకే
తీవ్రంగా తప్పుబట్టిన అంతర్జాతీయ సమాజం
న్యూయార్క్: పాకిస్తాన్ దన్నుతో ఉగ్రవాదులు పహల్గాంలో అనాగరిక దాడులకు తెగబడినందుకే సైనిక చర్య చేపట్టామని భారత్ ఓవైపు అంతర్జాతీయ సమాజానికి చెబుతుంటే మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అదే దాయాదిదేశానికి భారీ సాయం చేయడం వివాదాస్పదమైంది. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడంతో ఉగ్ర, పాక్ దోస్తీ బట్టబయలైన సమయంలోనే ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్ ఇలా నిధులు ఇవ్వడమేంటని పలువురు అంతర్జాతీయ ఆర్థికరంగ నిపుణులు విమర్శలు గుప్పించారు.
పాకిస్తాన్‌కు మరో 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,540 కోట్లు వెంటనే ఇచ్చేందుకు ఐఎంఎఫ్ శుక్రవారం అంగీకరించడమే ఈ విమర్శలకు అసలు కారణం. ఇటీవలే మరో 1.1 బిలియన్ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్ పచ్చజెండా ఊపడంతో మొత్తంగా పాకిస్తాన్‌కు 2.1 బిలియన్ డాలర్ల నిధుల వరద పారనుందని తెలుస్తోంది. వాతావరణ సంబంధ ప్రాజెక్టులు, పనుల నిమిత్తం పాకిస్తాన్ ఈ నిధులను కోరగా రుణంగా అందజేసేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. అయితే ప్రజాపనుల నిమిత్తం నిధులు ఇస్తున్నాసరే, ఉద్రిక్తతల వేళ నిధుల విడుదల సహేతుకంగా లేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఇప్పటికే పరస్పర సైనిక చర్యల కారణంగా ఆయుధాల సేకరణ అనేది పాకిస్తాన్‌కు అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఈ సమయంలో ఒకేసారి వేల కోట్ల రూపాయల నిధులు వచి్చపడితే వాటిని సంబంధిత లక్ష్యం కోసం కాకుండా సైనిక సన్నద్ధత, ఆయుధాల కొనుగోలు కోసం దురి్వనియోగం చేసే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చారు. సమకాలీన పరిస్థితులను, కనీసం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని అయినా నిధుల విడుదలపై ఐఎంఎఫ్ పునరాలోచన చేస్తే బాగుండేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
అభ్యంతరం తెలిపిన భారత్
పాకిస్తాన్‌కు అదనపు నిధుల విడుదల(ఈఎఫ్‌ఎఫ్)పై శుక్రవారమే ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం జరిగింది. రెసీలెన్స్ అండ్ సస్టేనబిలిటీ ఫెసిలిటీ పథకంలో భాగంగా పాక్‌కు అదనపు నిధులు ఇవ్వడంపై సమావేశం నిర్వహించారు. ఇందులో సభ్యదేశంగా భారత్ పాల్గొని ఉద్రిక్తత వేళ పాక్‌కు రుణవితరణ ఆపాలని డిమాండ్‌చేసింది. అయితే ఇక్కడ ఐక్యరాజ్యసమితి, భద్రత మండలి తరహాలో ఓటింగ్‌లో గైర్హాజరు వంటి అవకాశం ఉండదు. కేవలం అభ్యంతరం మాత్రమే వ్యక్తంచేయగలం.
దీంతో గతంలో ఒప్పుకున్న 7 బిలియన్ డాలర్ల రుణాల్లో భాగంగా కొంతమేర నిధుల విడుదల చేయాలని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నిర్ణయించింది. సైనిక చర్యలో మునిగిన దేశానికి నిధులెలా ఇస్తారని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబాల్ తప్పుబట్టారు. ఐఎంఎఫ్ తన చేతులకు అనవసరంగా రక్తం అంటించుకుంటోందని యశ్వంత్ దేశ్‌ముఖ్ విమర్శించారు. పాక్ తన ఆర్థిక సంస్కరణల ఊసే మర్చిపోయి మారణాయుధాల కొనుగోళ్లకు ఈ నిధులను కేటాయించడం ఖాయమని ‘అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్’లో నిపుణుడు సుశాంత్ సరీన్ అన్నారు.
గత 35 సంవత్సరాల్లో పాకిస్తాన్ ఇలా 28 రుణాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ వాటిని సవ్యంగా అమలుచేసిన చరిత్ర ధూర్తదేశానికి లేదని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భారత్‌పై బాంబులేస్తున్న వేళ ఈ రుణవితరణ ఏవిధంగా హేతుబద్ధం అనిపించుకుంటుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘రుణగ్రస్త పాకిస్తాన్‌ను ఐఎంఎఫ్ నిధుల సాయంతో ఒడ్డున పడేయట్లేదు. మరింతగా నెత్తుటేర్లు పారించేందుకు సాయపడుతోంది. ఇలా హంతక పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఇంకెన్నాళ్లు నిధులిస్తాయి?’అని ప్రవాసంలో గడుపుతున్న అఫ్గానిస్తాన్ మహిళా ఎంపీ మరియం సోలాయ్‌మన్‌ఖిల్ అన్నారు.