ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం జూమ్‌ 

IDFC First Bank Net Profit Jumps Over Two Fold To Rs 343 Crore In March - Sakshi

క్యూ4లో రూ. 343 కోట్లు 

న్యూఢిల్లీ: గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 168 శాతం జంప్‌చేసి రూ. 343 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,811 కోట్ల నుంచి రూ. 5,385 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం ఎగసి రూ. 2,669 కోట్లకు చేరింది. ఫీజు, ఇతర ఆదాయం 40 శాతం వృద్ధితో రూ. 841 కోట్లను తాకింది.  

పూర్తి ఏడాదికి 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మాత్రం ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 68 శాతం క్షీణించి రూ. 145 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 452 కోట్లు ఆర్జించింది. కోవిడ్‌–19 రెండో దశ ప్రభావం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంక్‌ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,179 కోట్ల నుంచి రూ. 20,395 కోట్లకు పెరిగింది.

నికర వడ్డీ ఆదాయం సైతం 32 శాతం ఎగసి రూ. 9,706 కోట్లకు చేరింది. కాగా.. రిటైల్‌ విభాగంలో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.01 శాతం నుంచి 2.63 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్‌ వెల్లడించారు. ఈ బాటలో నికర ఎన్‌పీఏలు సైతం 1.9 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top