హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?

Ideal Credit Score to Apply for Personal, Home Loan - Sakshi

వెబ్‌డెస్క్‌: సీజన్స్‌తో, సంక్షోభాలతో, సమస్యలతో సంబంధం లేకుండా డబ్బు అవసరమైన వారిని ఆదుకునేది ఏదైనా ఉందా అంటే అవి బ్యాంకులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు కోసం బ్యాంకులు పర్సనల్ లోన్ ఇస్తాయి. అలాగే, కొత్త ఇల్లు కొనుక్కోవాలి అన్న హోమ్ లోన్ పేరుతో బ్యాంకలు రుణాలు అందిస్తాయి. అయితే, ఇలా ధరఖాస్తు చేసుకున్న రుణాలను బ్యాంకులు తొందరగా ఆమోదించాలంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి. అందుకే ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సిబిల్ స్కోర్ గురుంచి ముందుగా తెలుసుకోవాలి.

సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతినే సిబిల్ స్కోర్ అంటారు. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించిన తీరు, తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ నిర్ణయిస్తారు. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తాయి.

రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం?
సిబిల్ స్కోరు మీ క్రెడిట్ చరిత్రను చూపిస్తుంది. మీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రుణదాత ఆమోదం తెలిపే శాతం పెరుగుతుంది. ఈ సిబిల్ స్కోర్  గతంలో మీరు తీసుకున్న రుణాల తిరిగి చెల్లించడంలో ఎంత బాధ్యతగా ఉన్నారు అని చూపిస్తుంది. సిబిల్ స్కోర్ లో మినిమం స్కోర్ 300 కాగా అత్యదిక స్కోర్ 900గా ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే మీకు రుణం పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ స్కోర్ వస్తే.. మీ దరఖాస్తు చేసుకున్న లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

మీ దరఖాస్తు ఆమోదం పొందాలంటే మీ క్రెడిట్ స్కోరు మాత్రమే ప్రమాణం కాదని గుర్తుంచుకోండి. మీకు నెలానెలా వచ్చే ఆదాయం, వేతనం ఎంత? ఆదాయంలోంచి వ్యయం పోగా మిగిలిన దాంట్లో తిరిగి రుణం చెల్లించే పరిస్థితి ఉందా లేదా? మీరు ఉంటున్న నగరం, అప్పులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలన్నింటినీ బ్యాంకులు పరిశీలిస్తాయి. 

వ్యక్తిగత రుణం కోసం ఎంత సిబిల్  స్కోర్ ఉండాలి?
మీరు ఇంటి అవసరాల కోసం వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్ వెల్లడించిన వివరాల ప్రకారం 720-750 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే కానీ పర్సనల్ లోన్ మంజూరు చేయడం సులభం కాదు. అంతకంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే, మీరు చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది లేదా సాధారణ స్థాయి వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేయడం జరుగుతుంది.

గృహ రుణం ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి?
బజాజ్ ఫిన్‌సర్వ్ వెల్లడించిన వివరాల ప్రకారం గృహ రుణం అనేది సురక్షితమైన లోన్, ఎందుకంటే మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు తాకట్టుగా పనిచేస్తుంది. అందువల్ల, మీ క్రెడిట్ స్కోరు 750 కన్నా తక్కువగా ఉన్నప్పటికీ గృహ రుణం పొందడం సాధ్యమవుతుంది. మీ క్రెడిట్ స్కోరు 650 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా కొంతమంది రుణదాతలు గృహ రుణాలను మంజూరు చేస్తారు. అయితే వడ్డీరేటు ఎక్కువ విధించే అవకాశం ఉంటుంది అని మరిచిపోవద్దు.

చదవండి: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయ‌డం ఎలా..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top