ఊపందుకున్న హోటల్‌ పరిశ్రమ

ICRA expects hotel industry revenues, margins to return to preCovid levels in FY23 - Sakshi

కరోనా ముందు స్థాయి మార్జిన్లు, ఆదాయం  

2022–23పై ఇక్రా అంచనాలు

న్యూఢిల్లీ: హోటల్‌ పరిశ్రమ కరోనా ముందు నాటి స్థాయి ఆదాయం, మార్జిన్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకుంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కరోనా వైరస్‌ కేసులు భవిష్యత్తులో పెరిగినా డిమాండ్‌ బలంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దేశీయ విహార యాత్రలు, తాత్కాలిక ప్రయాణాలు డిమాండ్‌ను నడిపించేవిగా పేర్కొంది. వ్యాపార ప్రయాణాలు, విదేశీ పర్యాటకుల రాకలో క్రమంగా పురోగతి కనిపిస్తున్నట్టు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇక్రా వివరించింది. దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో గదుల భర్తీ రేటు 2022–23లో 68–70 శాతం మేర ఉండొచ్చని వెల్లడించింది.

సగటు రూమ్‌ రేటు రూ.5,600–5,800 స్థాయిలో ఉంటుందని తెలిపింది. వ్యయాలను పరిమితం చేసే చర్యలు, నిర్వహణ పనితీరు మెరుగుపడడం వంటివి మార్జిన్లకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ‘‘2022–23 సంవత్సరం ఆరంభం హోటల్‌ పరిశ్రమకు సానుకూలంగా ఉంది. ప్రీమియం హోటళ్లలో భర్తీ రేటు 56–58 శాతం మేర మొదటి మూడు నెలల్లో (జూన్‌ క్వార్టర్‌)లో నమోదైంది.

2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 40–42 శాతం కంటే ఇది ఎక్కువ. కరోనాకు ముందు 20219–20 మొదటి మూడు నెలల్లో ఉన్న 60–62 శాతం సమీపానికి చేరుకుంది. 2022–23 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా సగటు రూమ్‌ రేటు 4,600–4,800గా నమోదైంది. 2021–22లో ఇది రూ.4,200–4,400గా ఉంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఇంకా 16–18 శాతం తక్కువలో ఉంది’’అని ఇక్రా హోటల్‌ సెక్టార్‌ హెడ్‌ వినుతా తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top