కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే సామెత మనలో చాలా మందికి తెలిసిందే.. అయితే చాలా మంది కొత్త విషయానికి ఆకర్షితులయ్యినంతగా.. అలవాటు పడిన పాతదానికి ఆకర్షితులు కారనేది ఒక కోణమైతే.. పాత విషయాన్నీ అలా వదిలేయకుండా నిలబెట్టుకుంటూ.. కొత్త వాటిని తొందరపడి వదులుకోకూడదు అనే మరో కోణాన్నీ ప్రతిబింబిస్తుంది. సరిగ్గా ఇదే చెవికెక్కించుకున్నారో! ఏమో గానీ నగరంలో పాత ఇళ్ల (వింటేజ్ హౌస్)కు ఆదరణ పెరుగుతోంది. అలాంటి ఇంటి వరండాలో కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ సేవించడం, లివింగ్ రూమ్‌లో ఆసీనులై పుస్తక పఠనం చేయడం, మిద్దె మీదకు ఎక్కి నక్షత్రాల నీడలో నచి్చన సంగీతాన్ని ఆస్వాదించడం.. వంటి సంప్రదాయ అభిరుచులన్నీ సిటీలోని ఏ ఆధునిక కేఫ్‌కి వెళ్లినా సుసాధ్యమే. సిటీలో ప్రస్తుతం ఈ తరహా ట్రెండీ కేఫ్స్ పాత ఇళ్లలోనే ఏర్పాటవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
నగరంలో నివసించాలి అనుకునేవారు మాత్రమే కాదు.. కేఫ్ ఏర్పాటు చేయాలనుకుంటున్న వారు కూడా ఇళ్లనే అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం కేఫ్స్ అంటే ఆహారం, పానీయాలు మాత్రమే అందించే చోటు కాదు.. పాత కథలను చెప్పే కొత్త వేదికలు కూడా. నగరంలో కేఫ్ సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఇటీవల ఒక కొత్త ధోరణిని సంతరించుకుంటోంది. పాత ఇళ్లు, బంగ్లాలు హాయిగా, అందమైన గొప్ప కేఫ్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి.

ఎంత ఓల్డ్ అయితే అంత గోల్డ్..
వీలైనంత పాత ఇళ్లనే కేఫ్స్ కోసం ఎంచుకోవడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కేఫ్స్‌లో 1970ల నాటి హెరిటేజ్ విల్లాలు సైతం కేఫ్స్‌గా అవతరించాయి. నగరంలో కేఫ్‌లుగా మారిన ఇళ్లు సాధారణ వాణిజ్య సెటప్‌ల నుంచి ప్రత్యేకంగా నిలుస్తూ ‘ఇంటి నుంచి దూరంగా ఉన్నవారి ఇల్లు’ లాగా సేద తీరుస్తున్నాయి. వీటిలో సూర్యకాంతి ధారాళంగా ప్రవహించే వరండాలు, పాతకాలపు కిటికీలు, ద్వారాలతో గత జీవితాల జాడలను గుర్తుచేస్తాయి. అలా నగరంలో పాత ఇంటి నుంచి కొత్త కేఫ్స్‌గా మారినవి కొన్ని..
వారసత్వ నిర్మాణాలు..
80 ఏళ్ల వయసు గల ఓ పురాతన భవనం బంజారాహిల్స్‌లో ప్రస్తుతం రోస్టరీ కాఫీ హౌస్‌గా ఆధునిక సొబగులు అద్దుకుంది. అతిగా మార్పు చేర్పులు లేకుండా ఈ భవనంలోకి వెళుతుంటే ఓ పాత ఇంట్లోకి అడుగుపెడుతున్న అనుభూతి పొందవచ్చు. ఈ వింటేజ్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌ను కేఫ్‌గా మార్చారు. దాని పాతకాలపు అందాన్ని చెక్కుచెదరకుండా అలాగే ఉంచిన ఫలితంగా వారసత్వ నిర్మాణాన్ని తాజా కాఫీ సువాసనతో మిళితం చేస్తూ సరికొత్త ఫ్యూజన్ ప్లేస్‌గా నిలుస్తోంది.
కేరళ తరహా నిర్మాణం..
దాదాపు కేరళ శైలి నిర్మాణాన్ని అనుకరించే వారసత్వ భవనానికి ప్రస్తుతం సృజనాత్మక, కళాత్మకను అద్ది ఆరోమలే కేఫ్ పేరిట రూపుదిద్దారు. జూబ్లీహిల్స్‌లోని ఆ ఇంటిలోని తోట సహా నాటి నివాస అనుభూతిని అచ్చంగా భద్రపరిచారు. దీనిని వాణిజ్య అవసరాలతో పునఃరూపకల్పన చేయడానికి బదులుగా, యజమానులు పాత ఇంటిలోని ప్రతి గదినీ చదవడం, సంగీతం, సంభాషణలు, కమ్యూనిటీ సమావేశాల కోసం ప్రత్యేకంగా మార్చారు.
గాలి, వెలుతురుకు అనుకూలంగా..
జూబ్లీహిల్స్‌లోనే మరో కేఫ్ గ్లాస్ హౌస్. ఇంటి సుపరిచితమైన లేఅవుట్‌ను కొనసాగిస్తూనే కేఫ్‌గా మారిన నివాస స్థలం. ఇది ఇప్పటికీ ఇల్లులా కనిపిస్తుంది. వరండా, ప్రాంగణం సీటింగ్ ప్రదేశంగా మారింది. అలాగే ఒకదానితో ఒకటి అనుసంధానించిన ‘గదులు‘ ఉన్నాయి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహిస్తూ ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తాయి. సైనిక్‌పురిలో ఉన్న దిస్ ఈజ్ ఇట్ కూడా దాని గత గృహశైలి లేఅవుట్‌ను యథాతథంగా ఉంచింది. లైటింగ్‌తో నివాస భవనాన్ని తలిపించేలా ఆలోచనాత్మకంగా
పునర్‌నిర్మితమైంది.
అబ్బురపరిచే ఆర్కిటెక్చర్..
ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ నివేదిక ప్రకారం 1970లో నిర్మించిన ఇంటి లోపల ఏర్పాటైంది రేషియో. జూబ్లీహిల్స్‌లో ఇటీవలే ప్రారంభమైన ఈ కేఫ్‌ను దాని పురాతన ఆత్మను నిలుపుకునేలా ఆలోచనాత్మకంగా వాస్తుశిల్పులు పునఃరూపకల్పన చేశారు. పొడవైన పైన్–వుడ్ కిటికీలు, సూర్యకాంతి పడేలా ప్రత్యేక స్థలాన్ని ప్రవేశపెట్టారు. అదే సమయంలో అసలు ఇంటి సారం చెక్కుచెదరకుండా ఉంచారు.
అలంకరణలు చెక్కు చెదరకుండా..
హిమాయత్‌నగర్‌లోని మిరోసా కేఫ్ మరో నివాస విల్లా. ఇది ఓపెన్ సీటింగ్‌తో రెండు అంతస్తుల లేఅవుట్. సన్నిహిత సీటింగ్, వెచ్చని రంగుల పాలెట్.. అతిథులకు సుపరిచితమైన ఇంటి అనుభూతిని ఇస్తుంది.
ఫిల్మ్ నగర్‌లోని వైబేయార్డ్ బిస్ట్రో కేఫ్‌లోని ఆక్సైడ్ గోడలు, చెక్క తలుపులు/ కిటికీలు, విశాలమైన గార్డెన్.. పురాతన ఇంటి అనుభవాన్ని అందిస్తాయి.
జూబ్లీ హిల్స్‌లోని ది ఫిఫ్త్ స్ట్రీట్ కేఫ్ ఇదే కోవకు చెందింది. చెక్క అలంకరణలు, ఒకదానితో ఒకటి అనుసంధానించిన గదులు, ఇంటి ఫీల్‌ను సజీవంగా ఉంచుతాయి.


