'సిప్‌' రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు వారం మంచిదా? నెలవారీ మంచిదా! | How To Invest In Sip | Sakshi
Sakshi News home page

'సిప్‌' రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు వారం మంచిదా? నెలవారీ మంచిదా!

Apr 25 2022 7:25 AM | Updated on Apr 25 2022 11:00 AM

How To Invest In Sip - Sakshi

నేను సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్‌ లేదా నెలవారీ సిప్‌ ఏది ఎంపిక చేసుకోవాలి?  – అమర్‌ సహాని 

నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా చేస్తున్నాం కదా అని వాదించొచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్‌ అమలు చేయాలి? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్‌ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. 

డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? – మంజునాథ్‌ 

డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు పన్ను పరంగా అనుకూలం కానందున వీటి పట్ల నేను వ్యతిరేకం. డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ కింద ఫండ్‌ సంస్థ డివిడెండ్‌ ప్రకటించినట్టయితే ఆ మొత్తం ఇన్వెస్టర్‌ బ్యాంకు ఖాతాకు రాదు. ఆ మొత్తం ఆటోమేటిక్‌గా అదే పథకంలో పెట్టుబడిగా మారిపోయి యూనిట్లు జమ అవుతాయి. దాంతో డివిడెండ్‌ విలువకు సరిపడా యూనిట్లను పొందుతారు. ఈ కార్యక్రమం మొత్తం మీద చేతికి వచ్చే డివిడెండ్‌ ఏమీ లేకపోయినా పన్ను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల డివిడెండ్‌ ఆదాయం కూడా మొత్తం ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు వారికి వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లకు గ్రోత్‌ ప్లాన్‌ మెరుగైన ఎంపిక అవుతుంది.  

సెన్సెక్స్‌ 42,000కు చేరినప్పుడు ఈక్విటీల నుంచి 50 శాతం పెట్టుబడులు వెనక్కి తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను చేసింది తప్పు అని అర్థం చేసుకున్నాను. తిరిగి మళ్లీ ఇప్పుడు పెట్టుబడులు ఎలా పెట్టాలి?  – రాజేష్‌ 

అందుకే మార్కెట్‌ టైమింగ్‌ను ఎప్పుడూ అంచనా వేసే ప్రయత్నం చేయకూడదు. మార్కెట్లు ఏ సమయంలో ఎలా నడుచుకుంటాయన్నదానిపై దృష్టి సారించకూడదు. దీనికి బదులు మీ పెట్టుబడుల లక్ష్యాలు, కాల వ్యవధి, ఎంత రిస్క్‌ తీసుకోగలరు తదితర అంశాల ఆధారంగానే నడుచుకోవాలి. దీన్ని ఒక అనుభవంగా తీసుకుని మార్కెట్‌ గమనాన్ని అంచనా వేసే ప్రయత్నం మానుకోండి. దీనికి బదులు పెట్టుబడుల నిర్ణయాలకు సమయాన్ని కేటాయించండి. మళ్లీ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడానికి భిన్నంగా ఏమీ వ్యవహరించక్కర్లేదు. మీ దగ్గరున్న పెట్టుబడిని క్రమానుగతంగా వచ్చే 10–12 నెలల కాలంలో ఇన్వెస్ట్‌ చేసుకోండి.

చదవండి👉 వారం/నెల ‘సిప్‌’.. ఏది మంచిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement