ఆతిథ్య రంగానికి ఇన్‌ఫ్రా హోదా: హోటల్స్‌ యాజమాన్యాల డిమాండ్‌

Hotel Body Patches For Infrastructure Status To Hospitality Sector Requests Central Govt - Sakshi

ఆతిథ్య రంగం (హోటల్స్‌) తమకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (మౌలిక రంగం) హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల ఆర్‌బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లెండింగ్‌ నిబంధనల కింద దీర్ఘకాలానికి నిధులను పొందే వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. పర్యాటకం, హాస్పిటాలిటీకి (ఆతిథ్యం) పరిశ్రమ హోదాను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినప్పటికీ.. కావాల్సిన ప్రోత్సాహకాలు, అధికారాలు ఈ రంగానికి రావడం లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) ఆవేదన వ్యక్తం చేసింది.

ఆర్‌బీఐ నిబంధనల కింద దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు పరిశ్రమకు భారత ప్రభుత్వం ద్వారా మౌలిక రంగం హోదా కావాలని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ సెక్రటరీ జనరల్‌ జైసన్‌ చాకో పేర్కొన్నారు. దీనివల్ల నాణ్యమైన వసతి సదుపాయాల సరఫరా పెరుగుతుందని, దేశీ, అంతర్జాతీయ పర్యాటకుల డిమాండ్‌ను పెంచుతుందని చాకో అభిప్రాయపడ్డారు. పర్యాటకాన్ని జాతీయ ఏజెండాగా మార్చేందుకు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఆతిథ్యాన్ని చేర్చాలని పరిశ్రమ కోరింది. దేశంలో ఆతిథ్య పరిశ్రమ సమగ్రాభివృద్ధికి వీలుగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, అమలుకు గాను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని అభిప్రాయపడింది. వచ్చే బడ్జెట్‌లో కనీస ప్రత్యామ్నాయ పన్ను విషయంలో 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు వెసులుబాటు కల్పించాలని పశ్చిమ భారత్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ షెట్టీ డిమాండ్‌ చేశారు. దీనివల్ల పన్నుల భారం తగ్గి, హోటల్‌ పరిశ్రమకు కొంత ఉపశమనం లభిస్తుందన్నారు.

చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top