దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్‌లు తదితరాలు తమ వద్ద అందుబాటులో ఉన్న వివిధ వైద్య సేవలు, పడకల రుసుము, టెస్ట్‌ల ధరల పట్టికను రోగులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం కింద నిర్దేశించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చెప్పారు. తద్వారా రోగులకు ముందస్తుగానే వ్యయ సమాచారం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
రేట్ల పట్టిక ప్రదర్శన తప్పనిసరి
కేంద్ర ఆదేశాల ప్రకారం, ప్రతి వైద్య కేంద్రం తమ రిసెప్షన్ లేదా ఆవరణలోని ప్రముఖ ప్రదేశాలలో స్థానిక భాషతో పాటు ఆంగ్లంలో కూడా వివిధ సేవల రుసుముల వివరాలను ప్రదర్శించాలి. ఓపీడీ ఫీజు, ఐసీయూ పడకల ధరలు, డయాగ్నోస్టిక్ పరీక్షలు, ప్రధాన శస్త్రచికిత్సల అంచనా వ్యయాల జాబితాను స్పష్టంగా ఉంచాలి. చికిత్స ముగిసాక అదనపు లేదా అస్పష్ట రుసుములతో రోగుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చూడటమే ఈ చర్య ప్రధాన లక్ష్యం.


