Honeywell Scientist Invented the Formula of Petrol From Plastic - Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ నుంచి పెట్రోల్‌..అందుబాటులో ఎప్పుడంటే ?

Nov 11 2021 12:43 PM | Updated on Nov 11 2021 2:29 PM

 Honeywell Scientist Invented The Formula Of Petrol From Plastic - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేల, నీరును కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌ను వదిలించుకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. విమానాల విడిభాగాలు, రసాయనాలను తయారుచేసే అంతర్జాతీయ కంపెనీ ‘హనీవెల్‌’ తాజాగా ప్లాస్టిక్‌ భూతంపై ఓ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. అన్ని రకాల ప్లాస్టిక్‌ చెత్తను నాణ్యమైన ముడి చమురుగా మార్చేసే ప్రక్రియను ఆవిష్కరించింది. హనీవెల్‌ అక్కడితోనే ఆగిపోలేదు. స్పెయిన్‌ సంస్థ సాకైర్‌ ఎస్‌ఏతో కలసి ఏటా 30 వేల టన్నుల ప్లాస్టిక్‌ చెత్తను ముడి చమురుగా మార్చే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే 2023 కల్లా ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించవచ్చు. 

సుమారు 57 శాతం సీఓ2ను తగ్గించొచ్చు
ఒక్కసారి తయారు చేశామంటే ప్లాస్టిక్‌ను నాశనం చేయడం అంత సులువైన పని కాదన్నది మనందరికీ తెలిసిన విషయమే. లెక్కలు చూస్తే ఏటా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో వాడకం తరువాత సగం చెత్తకుప్పల్లోకి చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇంకో 30 శాతం నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. రెండు శాతం ప్లాస్టిక్‌ మాత్రం మళ్లీ వాడుకొనే కొత్త ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతోంది. ప్లాస్టిక్‌తో పెట్రోల్, డీజిల్, కృత్రిమ నూలు తయారీలకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే హనీవెల్‌ అభివృద్ధి చేసిన పద్ధతి వల్ల ప్లాస్టిక్‌ను కూడా ఇతర పదార్థాల మాదిరిగా మళ్లీమళ్లీ వాడుకొనే అవకాశం లభిస్తుంది. ఆ కంపెనీ అంచనా ప్రకారం ఈ పద్ధతి వల్ల ప్లాస్టిక్‌ తయారీ ద్వారా వాతావరణంలోకి విడుదల అవుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ మోతాదు దాదాపు 57 శాతం వరకూ తగ్గుతుంది.  

ఏమిటా పద్ధతి? 
నిజానికి హనీవెల్‌ ఉపయోగించిన ఆక్సిజన్‌ లేకుండా మండించే (పైరోలసిస్‌) పద్ధతి కొత్తదేమీ కాదు. కాకపోతే ముడి చమురులోని సూక్ష్మస్థాయి కాలుష్యాలను కూడా దశాబ్దాలుగా తొలగిస్తున్న హనీవెల్‌ తన అనుభవాన్నంత ఈ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగించింది. అప్‌సైకిల్‌ అని పిలుస్తున్న ఈ పద్ధతిలో అన్ని రకాల ప్లాస్టిక్‌ను కలిపి వాడగలగడం విశేషం. పైరాలసిస్‌కు తోడు కొన్ని రసాయన ప్రక్రియలను కూడా ఉపయోగించడం ద్వారా తాము ముడి చమురును తయారు చేయగలుగుతున్నామని కంపెనీ తెలిపింది. స్పెయిన్‌లో మాదిరిగా మరింత మంది భాగస్వాములను కలుపుకొని ఈ టెక్నాలజీని విస్తృత వినియోగంలోకి తెస్తామని, ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో 90 శాతాన్ని మళ్లీ వాడుకొనేలా ముడిచమురుగా మార్చగలమని కంపెనీ వివరిస్తోంది.     

చదవండి:బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement