క్యూ1లో హైరింగ్‌ అప్‌ | Sakshi
Sakshi News home page

క్యూ1లో హైరింగ్‌ అప్‌

Published Wed, Mar 29 2023 6:15 AM

Hiring in services and manufacturing to see 10percent jump in April-June 2023 - Sakshi

ముంబై: అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సర్వీసులు, తయారీ రంగాల కంపెనీలు మాత్రం నియామకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023–24 క్యూ1లో ఇది 10 శాతం అధికంగా ఉండగలదని అంచనాలు నెలకొన్నాయి. అయితే, 2022–23 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 4 శాతం తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌కి చెందిన ఉపాధి అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

14 రంగాలకు చెందిన 809 చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలపై చేసిన సర్వే ఆధారంగా టీమ్‌లీజ్‌ దీన్ని రూపొందించింది. ఇందులో పాల్గొన్న 64 శాతం మంది యజమానులు తమ సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. నివేదిక ప్రకారం సర్వీస్, తయారీ రంగాల్లో క్యూ1లో ప్రధానంగా ఎంట్రీ, జూనియర్‌ స్థాయి నియామకాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీసుల్లో ఇవి వరుసగా 73 శాతం, 71 శాతంగా ఉండగా .. తయారీలో 49 శాతం, 55 శాతంగా ఉన్నాయి. మధ్య స్థాయి ఉద్యోగాలకు సంబంధించి సర్వీసుల్లో 54 శాతంగాను, తయారీలో 32 శాతంగాను ఉన్నాయి.

అత్యధికంగా సర్వీస్‌ రంగంలో..
తయారీ విభాగంతో పోలిస్తే సర్వీసుల రంగంలో హైరింగ్‌కు ఎక్కువగా ఆస్కారం ఉంది. సేవా రంగం విషయానికొస్తే ఇది టెలికమ్యూనికేషన్స్‌లో 96%, ఆర్థిక సర్వీసులు (93%), ఈ–కామర్స్‌.. అనుబంధ స్టార్టప్‌లు (89%), రిటైల్‌ (87%), విద్యా సర్వీసుల్లో 83%గా ఉంది. తయారీ రంగంలో హెల్త్‌కేర్‌ .. ఫార్మాలో 91 శాతంగా, ఎఫ్‌ఎంసీజీలో 89 శాతంగా, ఎలక్ట్రిక్‌ వాహనాలు.. మౌలిక సదుపాయాల కల్పనలో 73 శాతంగా ఉంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement