భారత్‌లో సూపర్‌ లగ్జరీ కార్ల వేగానికి అదే అడ్డంకి | Sakshi
Sakshi News home page

భారత్‌లో సూపర్‌ లగ్జరీ కార్ల వేగానికి అదే అడ్డంకి

Published Wed, Aug 3 2022 8:00 AM

High Taxes Limits Super Luxury Car Sales In India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో సూపర్‌ లగ్జరీ కార్ల వృద్ధి వేగానికి అధిక పన్నులే అడ్డంకి అని లంబోర్గినీ వెల్లడించింది. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్‌ చిన్నదిగా ఉంటుందని ఆటోమొబిలి లంబోర్గినీ చైర్మన్, సీఈవో స్టీఫెన్‌ వింకిల్‌మన్‌ తెలిపారు. 2022 జనవరి–జూన్‌లో కంపెనీ అంతర్జాతీయంగా 4.9 శాతం వృద్ధితో 5,090 యూనిట్లను విక్రయించింది. భారత్‌లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని కృతనిశ్చయంతో ఉన్నట్టు స్టీఫెన్‌ చెప్పారు.

లంబోర్గినీ ప్రారంభ ధర రూ.3.16 కోట్లు. 2021లో కంపెనీ నుంచి 69 కార్లు రోడ్డెక్కాయి. 2019లో 52 కార్లు, 2020లో 37 యూనిట్లను విక్రయించింది. ఖరీదు, బీమా, రవాణా చార్జీలతో కలిపి 40,000 డాలర్లకుపైగా విలువ కలిగిన పెట్రోల్‌ ఇంజన్‌ 3,000 సీసీ, డీజిల్‌ ఇంజన్‌ 2,500 సీసీ, ఆపైన సామర్థ్యం ఉన్న కార్లను దిగుమతి చేసుకుంటే సుంకం 100 శాతం ఉంది. అన్ని ఖర్చులు కలిపి 40,000 డాలర్లకులోపు ఉండి, పెట్రోల్‌ ఇంజన్‌ 3,000 సీసీ, డీజిల్‌ ఇంజన్‌ 2,500 సీసీకి తక్కువగా ఉంటే దిగుమతి సుంకం 60 శాతం వసూలు చేస్తారు. రూ.2.5 కోట్లకుపైగా ఖరీదు కలిగిన సూపర్‌ లగ్జరీ కార్లు 2021లో 300 యూనిట్లు అమ్ముడయ్యాయి.

చదవండి: Adani: అదానీ దూకుడికి బ్రేక్‌.. గ్రీన్‌ డీలా!

Advertisement
 
Advertisement
 
Advertisement