HDFC Bank Q1 net profit rises 30% to Rs 11,952 crore - Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ1 భేష్‌

Published Tue, Jul 18 2023 6:22 AM

HDFC Bank Q1 Net profit rises 30percent to Rs 11,952 crore - Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 29 శాతం జంప్‌చేసి రూ. 12,370 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 9,579 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది (2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్జించిన రూ. 12,594 కోట్లతో పోలిస్తే తాజా లాభం స్వల్పంగా తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ. 44,202 కోట్ల నుంచి రూ. 61,021 కోట్లకు దూసుకెళ్లింది. నిర్వహణ వ్యయాలు 34 శాతం పెరిగి రూ. 15,177 కోట్లకు చేరాయి. ఈ జూలై 1 నుంచి బ్యాంక్‌ మాతృ సంస్థ, మారి్టగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.   

వడ్డీ ఆదాయం అప్‌
స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.12 శాతం నుంచి 1.17 శాతానికి నామమాత్రంగా పెరిగాయి. గతేడాది క్యూ4లో నమోదైన 1.28 శాతం నుంచి చూస్తే నీరసించాయి. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంక్‌ స్టాండెలోన్‌ నికర లాభం సైతం 30 శాతం ఎగసి రూ. 11,952 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం బలపడి రూ. 23,599 కోట్లకు చేరింది. ఇందుకు అడ్వాన్సుల(రుణాలు)లో నమోదైన 15.8 శాతం వృద్ధి, 4.1 శాతానికి బలపడిన నికర వడ్డీ మార్జిన్లు దోహదం చేశాయి. ఈ కాలంలో రూ. 9,230 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించింది. ఇందుకు రూ. 552 కోట్లమేర ట్రేడింగ్‌ లాభాలు సహకరించాయి. గతేడాది క్యూ1లో ఈ పద్దుకింద రూ. 1,077 కోట్ల నష్టం ప్రకటించింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,122 కోట్ల నుంచి రూ. 2,860 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 18.9 శాతాన్ని తాకింది.  

ఇతర విశేషాలు...
► జూన్‌కల్లా బ్యాంకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,81,725కు చేరింది.
► అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ నికర లాభం రూ. 441 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు జంప్‌ చేసింది.
► హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ లాభం దాదాపు యథాతథంగా రూ. 189 కోట్లుగా నమోదైంది.
► బ్యాంక్‌ మొత్తం బ్రాంచీల సంఖ్య 7,860కు చేరింది. వీటిలో 52 శాతం సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి.
► గతేడాది 1,400 బ్రాంచీలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది సైతం ఈ బాటలో సాగనున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది.


మార్కెట్‌ క్యాప్‌ రికార్డ్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 2 శాతం బలపడి రూ. 1,679 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి మార్కెట్‌ విలువరీత్యా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(రూ. 18.91 లక్షల కోట్లు), టీసీఎస్‌(రూ. 12.77 లక్షల కోట్లు) తర్వాత మూడో ర్యాంకులో నిలిచింది. అంతేకాకుండా డాలర్ల మార్కెట్‌ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్‌ దిగ్గజాలు మోర్గాన్‌ స్టాన్లీ(144 బిలి యన్‌ డాలర్లు), బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(138 బి.డా.), గోల్డ్‌మన్‌ శాక్స్‌(108 బి.డా.)లను దాటేసింది.

ప్రపంచ బ్యాంకింగ్‌లో 7వ ర్యాంక్‌
ర్యాంక్‌    బ్యాంక్‌ పేరు           మార్కెట్‌ క్యాప్‌
1.    జేపీ మోర్గాన్‌    438
2.    బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా    232
3.    ఐసీబీసీ(చైనా)    224
4.    అగ్రికల్చరల్‌ బ్యాంక్‌(చైనా)    171
5.    వెల్స్‌ ఫార్గో    163
6.    హెచ్‌ఎస్‌బీసీ    160
7.    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌    154


(విలువ బిలియన్‌ డాలర్లలో– విదేశీ బ్యాంకులు  శుక్రవారం(14న) ధరల్లో)

Advertisement

తప్పక చదవండి

Advertisement