ఇన్వెస్టర్లూ.. కొంటారా కొత్త షేర్లు? | HDB Financial IPO Price band set at Rs 700 740 per share | Sakshi
Sakshi News home page

ఈ వారం ఐపీవోల్లో ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ, ఇతర కంపెనీలు

Jun 21 2025 3:59 PM | Updated on Jun 21 2025 5:07 PM

HDB Financial IPO Price band set at Rs 700 740 per share

ఎన్‌బీఎఫ్‌సీ.. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 700–740 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 25న ప్రారంభంకానున్న ఇష్యూ 27న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది.

ఇష్యూ ద్వారా రూ. 12,500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు  కనీసం 20 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌లో ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 94.36 శాతం వాటా కలిగి ఉంది. అనుబంధ సంస్థ విలువను రూ. 61,400 కోట్లుగా బ్యాంక్‌ మదింపు చేసింది.

కాగా.. ఈక్విటీ జారీ నిధులను టైర్‌–1 మూలధన పటిష్టతకు హెచ్‌డీబీ కేటాయించనుంది. తద్వారా బిజినెస్‌ వృద్ధికి వీలుగా రుణాల విడుదల తదితర భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. జులై 2న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కావచ్చు.

సంభవ్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ 
ఎలక్ట్రిక్‌ రెసిస్టెన్స్‌ వెల్డెడ్‌(ఈఆర్‌డబ్ల్యూ) స్టీల్‌ పైపుల తయారీ కంపెనీ సంభవ్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభంకానుంది. 27న ముగియనున్న ఇష్యూకి రూ. 77–82 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.

ఇష్యూ ద్వారా మొత్తం రూ. 540 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. దేశీయంగా ఈఆర్‌డబ్ల్యూ స్టీల్‌ పైపులు, స్ట్రక్చురల్‌ ట్యూబుల(హాలో సెక్షన్‌) తయారీలోని కీలక కంపెనీలలో ఒకటిగా సంభవ్‌ స్టీల్‌ నిలుస్తోంది.

ఐకాన్‌ ఫెసిలిటేటర్స్‌ 
చిన్న, మధ్యతరహా కంపెనీ(ఎస్‌ఎంఈ).. ఐకాన్‌ ఫెసిలిటేటర్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 85–91 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 26న ముగియనుంది. ఐపీవోలో భాగంగా 21 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా టెక్నికల్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసులందించే కంపెనీ రూ. 19.1 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది.

ఐపీవో నిధుల్లో రూ. 16 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ఎలక్ట్రికల్, క్యాప్టివ్‌ పవర్, బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సర్వీసులు సమకూర్చుతోంది. అంతేకాకుండా ఫైర్‌ అండ్‌ సేఫ్టీ పరికరాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్ల నిర్వహణను సైతం చేపడుతోంది. 2025 మార్చి31కల్లా కంపెనీ 2,000 మందికిపైగా ఆయా విభాగాలలో నిపుణులైన ఉద్యోగులను కలిగి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement