Happy Birthday Sonam Wangchuk: ‘త్రీ ఇడియట్స్‌’ ఫేమ్‌ మేధావిని కన్నతండ్రే ఎందుకు అసహ్యించుకున్నాడంటే..

Happy Birthday Sonam Wangchuk Interesting Facts In Telugu - Sakshi

ఒక పోటీలో వందకు పది మంది ఓడితే.. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అదే వందలో 70 మంది విఫలమైతే.. మొత్తం వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. ఆ వైఫల్యాన్ని గుర్తించి తన అనుభవంతో మార్పు తేవడానికి ప్రయత్నించాడు సోనమ్‌ వాంగ్‌చుక్‌. సంప్రదాయేతర సిలబస్‌ను రూపొందించి ‘ఆసాన్‌ భాషామే’(సులభమైన భాషలో) పిల్లలకు పాఠాలు బోధించడం, మంచు నీటి ప్రవాహాలను గడ్డ కట్టించి.. వర్షాభావ పరిస్థితులప్పుడు వాడుకోవడం, సోలార్‌ ఆర్మీ టెంట్లు.. ఇలా ఆయన బుర్రలోంచి పుట్టిన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఒక ఇంజినీర్‌గా, ఆవిష్కరణకర్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన వాంగ్‌చుక్‌.. తన జీవితం కంటే ఆవిష్కరణలు, వాటి వెనుక ఆలోచనలే పిల్లలకు పాఠంగా ఉండటాన్ని ఇష్టపడతానని చెప్తుంటాడు. 

సోనమ్‌ వాంగ్‌చుక్‌ పుట్టినరోజు ఇవాళ. 1966 సెప్టెంబర్‌ 1న లడఖ్‌లోని లే జిల్లా ఉలెటోక్‌పో లో వాంగ్‌చుక్‌ జన్మించాడు. ఇంజినీర్‌ కమ్‌ సైంటిస్ట్ అయిన సోనమ్‌ వాంగ్‌చుక్‌ స్ఫూర్తి నుంచే త్రీ ఇడియట్స్‌ సినిమా తెరకెక్కిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో అమీర్‌ క్యారెక్టర్‌ పున్షుక్‌ వాంగ్డూ(రాంచో) చూపించే ప్లాన్‌లన్నీ వాంగ్‌చుక్‌ నిజజీవితంలో అమలు చేసినవే.
 

తల్లి నేర్పిన పాఠాలే..
వాంగ్‌చుక్‌ పుట్టిన ఊళ్లో బడి  లేదు. దీంతో 9 ఏళ్ల వయసుదాకా ఆయన బడి ముఖం చూడలేదు. ఆ వయసులో గృహిణి అయిన తల్లి నేర్పిన ఓనమాలే ఆయనకు దిక్కయ్యాయి. వాంగ్‌ చుక్‌ తండ్రి రాజకీయ వేత్త(మాజీ మంత్రి కూడా). అందుకే ఎలాగోలా శ్రీనగర్‌లోని ఓ స్కూల్‌లో కొడుక్కి అడ్మిషన్‌ తెచ్చాడు. అయితే వాంగ్‌చుక్‌కు తల్లి నేర్పిన భాషంతా స్థానిక భాషలో ఉండడంతో.. స్కూల్‌లో బాగా ఇబ్బందిపడేవాడు.

టీచర్లు అడిగిన దానికి సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉంటే.. ‘సుద్దమొద్దు’ అనే ముద్ర పడింది. తన తల్లి నేర్పిన ఆ ఓనమాలే తన పాలిట శాపం అయ్యాయని, అలా జరిగి ఉండకపోతే తన జీవితం కుటుంబానికి దూరం అయ్యేది కాదని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడాయన. అంతేకాదు శ్రీనగర్‌ బడిలో నడిపిన రోజుల్ని.. చీకటి రోజులుగా అభివర్ణించుకుంటాడు. టీచర్లు, తోటి విద్యార్థులు చూసే అవమానమైన చూపులకు, కామెంట్లకు భరించలేక ఒకదశకొచ్చేసరికి ఢిల్లీకి పారిపోయాడు.

పాకెట్‌మనీ లేకున్నా..
ఒంటరిగా ఢిల్లీకి చేరిన వాంగ్‌చుక్‌.. విశేష్‌కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ను కలిసి తన పరిస్థితిని వివరించాడు. తన స్కూల్‌ చదువులు పూర్తయ్యేదాకా  ఆచూకీ పేరెంట్స్‌కు చెప్పొద్దంటూ బతిమాలుకున్నాడు వాంగ్‌చుక్‌. అది అర్థం చేసుకుని, మాటిచ్చి వాంగ్‌చుక్‌కు తమ స్కూల్‌లో అడ్మిషన్‌ ఇచ్చాడు ఆ ప్రిన్స్‌పాల్‌. చదువులో రాటుదేలాక విషయాన్ని పేరెంట్స్‌కి తెలియజేసి.. తిరిగి వాళ్ల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆపై శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసి మరోసారి కుటుంబానికి దూరం అయ్యాడు. వాంగ్‌చుక్‌ ఆర్థిక నిపుణుడు కావాలన్నది ఆ తండ్రి కోరిక. అది నెరవేరకపోవడంతో కొడుకును అసహ్యించుకుని తిరిగి దగ్గరకు తీసుకోలేదు.

పేరెంట్స్‌కు దూరమైన వాంగ్‌చుక్‌.. తన స్కాలర్‌షిప్‌తోనే హాస్టల్‌ చదువులు కొనసాగించాడు. ఆపై ఓ ప్రొఫెసర్‌ సాయంతో ఫ్రాన్స్‌లో ఎర్తెన్‌ ఆర్చిటెక్చర్‌ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత ఇండియాకు వచ్చిన ఆయన జీవితం.. లడఖ్‌ పరిస్థితుల కారణంగా కొత్త మలుపు తిరిగింది. కామన్‌సెన్స్‌ ఉపయోగించి ప్రజల అవసరాలను తీర్చే ఆవిష్కరణలకు బీజం పడింది ఇక్కడి నుంచే..

లడఖ్‌లో అడుగుపెట్టేనాటికి.. అక్కడి విద్యార్థుల పాస్‌ పర్సంటేజ్‌ 5 శాతంగా తేలింది. దీంతో విద్యా సంస్కరణలకు బీజం వేశాడు. నిపుణులైన గ్రామస్తులకు-తల్లిదండ్రులకు శిక్షణ ఇప్పించాడు. వాళ్ల ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పించాడు. అలా ఐదు శాతం నుంచి 75 శాతానికి పాస్‌ పర్సంటేజ్‌ను మూడేళ్లలోనే సాధించి చూపించాడాయన. 
 స్టూడెంట్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూమెంట్‌ను కొందరు విద్యార్థులతో 1988లో స్థాపించాడు. పూర్తి సోలార్‌ ఎనర్జీతో నడిచే విద్యాలయం ఇది. 
► స్వచ్ఛమైన నీటిని గ్రామ ప్రజలకు అందించేందుకు ప్రవాహాలను దారి మళ్లించే ప్లాన్‌లు అమలు చేశాడాయన. ఐస్‌ స్థూపాలను కోన్‌ ఆకారంలో నెలకొల్పి కృత్రిమ       హిమానీనదాలతో నీటి కరువును తీర్చే ప్రయత్నం చేశాడు. 2013లో ‘ఐస్‌ స్తూప’ ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. 


 సోషల్‌ ఇంజినీర్‌గా ఎన్నో విచిత్రమైన ఆవిష్కరణలు చేశాడు వాంగ్‌చుక్‌. సోలార్‌ ప్రాజెక్టులతో లడఖ్‌ గ్రామీణ ముఖచిత్రం మార్చేశాడు. ఆ ఆవిష్కరణలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు కూడా.

 ప్రభుత్వ, కార్పొరేట్‌ వైఫల్య చదువుల్ని ఏలియన్‌ చదవులుగా వర్ణిస్తాడాయన. సంప్రదాయేతర బడి.. విద్యా సంస్కరణలకు బీజం వేయడంతో పాటు కొన్నాళ్లపాటు ప్రభుత్వ ఎడ్యుకేషన్‌  అడ్వైజరీగా వ్యవహరించాడు కూడా. 
నానో కారు వైఫల్యానికి కారణాల్లో ఒకటి.. పేదల కారుగా ప్రచారం చేయడమే అంటాడు సోనమ్‌ వాంగ్‌చుక్‌. పేదవాళ్లే ఆ కారును కొంటారనే ‘సొసైటీ యాక్సెప్టెన్సీ’ వల్ల దానిని జనాలు  తిప్పికొట్టారని చెప్పాడు.


► రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాంగ్‌చుక్‌.. వ్యవస్థ లోపాల వల్లే మంచి విద్య అందట్లేదని అభిప్రాయపడుతుంటాడు. ప్రజల ప్రాధాన్యం మారినప్పుడే.. ప్రభుత్వాల ఆలోచనా విధానం  మారుతుందని చెప్తాడాయన.

- సాక్షి, వెబ్‌డెస్క్‌ స్పెషల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top