Govt New Rule: ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్!

Govt Mandates Helmet, Safety Harness for Kids Riding Pillion on Two Wheelers - Sakshi

ద్విచక్ర వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం మరో కొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి బండి మీద 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు కూడా ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో వారికి సరిపడే హెల్మెట్‌ను ధరించాలి. లేకపోతే రూ.1,000 జరిమానా లేదా డ్రైవర్ లైసెన్స్'ను మూడు నెలల వరకు సస్పెన్షన్ చేయనున్నారు.

సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్, 1989కు సవరణ చేసి ఈ కొత్త నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. నాలుగు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలను ద్విచక్ర వాహనం మీద తీసుకొని వెళ్తున్నప్పుడు వాహనం గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది అని కూడా పేర్కొంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు పిల్లల భద్రత దృష్ట్యా హార్నెస్, హెల్మెట్ ఉపయోగించడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ప్రతిపాదించింది. ఈ విషయంపై పౌరుల అభిప్రాయాన్ని అడగడానికి అక్టోబర్ 2021లో ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.

ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు వారి భద్రత కోసం ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని మంత్రిత్వశాఖ పేర్కొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై పిల్లల్ని తీసుకువెళ్లాలంటే వారికి సేఫ్టీ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలి. అది కూడా చాలా తక్కువ బరువుతో వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. 30 కేజీల బరువును మోసే సామర్థ్యం దీనికి ఉండాలి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే చలానా వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలానే పిల్లల హెల్మెట్ల విషయానికి వస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అప్పటివరకు సైకిల్ హెల్మెట్లను వినియోగించాలని ప్రభుత్వం తెలిపింది.  

(చదవండి: వారెవ్వా! అదిరిపోయిన ఎలన్ మస్క్ మార్స్ విజన్ వీడియో..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top