
నిత్యం తల్లిదండ్రుల తగవులాటలు
బిక్కుబిక్కుమంటూ చిన్నారులు
ఎవరికీ చెప్పుకోలేక సతమతం
ఆందోళన, మానసిక ఒత్తిడి, కుంగుబాటు
పేరెంట్స్ మారాలంటున్న నిపుణులు
పిల్లలు వాళ్లంతట వాళ్లు తమ తల్లిదండ్రులను ఎంపిక చేసుకుని ఈ భూమి మీదకు రారు. మరి తల్లిదండ్రుల మధ్య కోపతాపాలకు, మనస్పర్థలకు, తగాదాలకు, బాధ్యతలేనితనాలకు, భావోద్వేగాలకు, అనాలోచిత నిర్ణయాలకు పిల్లలెందుకు బలైపోవాలి? చక్కగా ఆడుతూ, పాడుతూ, చదువుకుంటూ, స్వేచ్ఛగా, నిర్భీతిగా ఎదగాల్సిన వయసులో – ‘అమ్మానాన్న కొట్టుకుని చచ్చే హింసాత్మక సినిమా’ పిల్లలకెందుకు చూపించటం? వాళ్లకీ శిక్షేంటి?! అసలీ అంతులేని కర్మేంటి?!
శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కరావాల్ నగర్‌లో ఒక వ్యక్తి తన భార్యను (28)ను, ఇద్దరు కూతుళ్లను (7, 5) వారు నిద్రపోతుండగా గొంతు నులిమి చంపటం యావద్దేశాన్నీ కలచివేసింది. పేకాటకు అలవాటుపడి అతడు అప్పులపాలయ్యాడు. దీంతో భార్యాభర్తలు తరచు గొడవ పడేవారట. ఆ గొడవలు ఆ చిన్నారుల మనసులపై చాలా ప్రభావం చూపాయట. భర్త అప్పులు చేసి తీర్చలేక ఆ నిస్పృహలో భార్యా, కూతుళ్లను చంపేశాడని తెలుస్తోంది. అమాయకులైన ఆ ఇద్దరు బిడ్డలు ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టటమే పాపమన్నట్లుగా నిద్రలోనే ప్రాణాలను కోల్పోయారు.
విచక్షణ కోల్పోతున్న తల్లిదండ్రులు..: క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి పిల్లల్ని పొట్టన పెట్టుకునే తల్లిదండ్రులు కొందరైతే, నిత్యం పిల్లల కళ్ల ముందే తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉండే అమ్మానాన్నలు ఎంతోమంది! తమ ప్రవర్తనే తమ పిల్లలను మంచివాళ్లుగానో లేదా చెడ్డవాళ్లుగానో చేస్తుందన్న గ్రహింపు చాలామంది తల్లిదండ్రులకు ఉండటం లేదు. ఆ గ్రహింపు లేని తల్లిదండ్రులు.. ఘర్షణలతో పిల్లల మనసులనే కాదు, భవిష్యత్తు ఆశల్ని, కలల్ని కూడా ఛిద్రం చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎన్నో ఆశలతో ఎదురుచూస్తారు..: చిన్నపిల్లలంటే తల్లిదండ్రులు ప్రేమాభిమానాలతో వెలిగే చిరు దివ్వెల లాంటివాళ్లు. ఉదయం వెళ్లిన నాన్న.. సాయంత్రానికి ఏం కబుర్లు, బహుమతులు మోసుకొస్తారో అని ఎదురుచూసే చిన్నారులు కొందరు. నాన్నకు తాను కబుర్లు, కథలు చెప్పాలని ఉబలాటపడే బుజ్జాయిలు మరికొందరు. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ఇంటికి రాగానే.. భార్యతో గొడవపడే మగాళ్లు కొందరైతే, భర్తలను సతాయించే భార్యలు మరికొందరు. పోనీ, గదుల్లో పోట్లాడుకుంటారా అంటే అదీ కాదు.. ఆ పసిహృదయాల ముందే!
అపరాధ భావన
భార్యాభర్తల మధ్య గొడవలకు చాలామంది చిన్నారులు భయంతో గజగజలాడిపోతారు. ఘర్షణ కొనసాగుతున్నంతసేపూ వీళ్లు భయానికి, ఆందోళనకు గురవుతూనే ఉంటారు. అమ్మానాన్న ఎక్కడ విడిపోతారోనని కలవరపడతారు. తల్లిదండ్రుల పోట్లాటలో వాటి నోటి వచ్చే మాటల్ని బట్టి ఘర్షణకు కారణం తామేనన్న అపరాధ భావన కూడా పిల్లల్ని కుంగదీస్తుంది. విచారం, నిరాశ అలుముకుంటాయి. కొందరు లోలోపల దుఃఖపడుతుంటారు. కొందరు నిద్రకు దూరమౌతారు. ఇవన్నీ పిల్లల మనసులను తీవ్రంగా గాయపరుస్తాయి, వాళ్ల వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెప్పండి.. ఇవ్వండి.. తీర్చండి..
తల్లిదండ్రుల తగాదాలు వారి పిల్లల మానసిక అనారోగ్యాన్ని ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తాయో అనేక అధ్యయనాలలో వెల్లడయింది. అన్ని అధ్యయనాలు కూడా ప్రధానంగా చెప్పేదేంటంటే.. ఈ గొడవల వల్ల పిల్లల్లో నిరాశ, ఆందోళన, అభద్రతాభావం కలుగుతున్నాయట. అలాగే ఆ అధ్యయన ఫలితాలు తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశాయి. అవి :
గొడవ కారణం చెప్పండి..: మీ మధ్య ఏం జరిగిందో పిల్లలకు పైపైన అయినా చెప్పండి. ‘ఒక ముఖ్యమైన విషయం మీద మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయి. అంతే తప్ప ఇంకేం లేదు’ అని తెలియజేయండి. గొడవ పడటం తప్పేనని అంగీకరించండి.
వాళ్ల తప్పులేదని చెప్పండి..: గొడవలకు తామే కారణం అని పిల్లలు అనుకుంటుంటారు. అందువల్ల, వాదన జరగటంలో పిల్లల తప్పేమీ లేదని స్పష్టంగా చెప్పండి.
అనుమానాలను తీర్చండి..: మీ వాగ్వాదంపై పిల్లలకు అనేక సందేహాలు ఉంటాయి. వాటిని అడిగేందుకు జంకుతుంటారు. కనుక వారికి వచ్చే అనుమానాలను మీరే కనిపెట్టి, వారి సందేహాలు తీర్చండి. మనమంతా ఎప్పటికీ ఒక కుటుంబం అని పిల్లల్ని దగ్గరకు తీసుకోండి.
ఏం కాదని భరోసా ఇవ్వండి..: మీ భార్యాభర్తల మధ్య జరిగిన వాదన అప్పటి వరకేనని, దాని వల్ల ముందు ముందు ఏ సమస్యలూ రావని పిల్లలకు నమ్మకం కల్పించండి. మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉన్నాయని వారికి భరోసా ఇవ్వండి.
ఒక బాలిక ఉత్తరం!
పిల్లలకు బయటనుంచి ఏదైనా కష్టం వస్తే అమ్మానాన్నకు చెప్పుకొంటారు. కానీ, ఆ అమ్మానాన్నే తమకు వచ్చిన కష్టం అయితే.. ఇంకెవరికి చెప్పుకుంటారు? ఎలా చెప్పుకుంటారు? కొంచెం పెద్దపిల్లలైతే పత్రికల్లో వచ్చే కౌనె్సలింగ్ కాలమ్‌కి గోప్యంగా తమ ఆవేదనను రాసి పంపుతుంటారు. అలా రాసిన
ఒక ఉత్తరంలో ఎంత బాధ దాగి ఉందో చూడండి :
‘నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల మధ్య గొడవలు చూస్తున్నాను. కొన్నిసార్లు డబ్బు గురించి, మరి కొన్నిసార్లు కుటుంబ సమస్యల గురించి ఆ గొడవలు ఉంటాయి. వాటిని ఎలా ఆపాలో నాకు తెలియదు. వాళ్లూ ఆపాలని అనుకోరు. నేనంటూ ఒకదాన్ని ఉన్నానన్న గ్రహింపు వాళ్లకు ఉండదు. ఒక్కోసారి నాకు ఇంటి నుంచి పారిపోవాలని అనిపిస్తుంది. దాని వల్ల అమ్మానాన్నకు చెడ్డపేరు వస్తుంది.
అది ఆలోచించి ఆగిపోతాను. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి కష్టపడి చదువుతున్నాను. కానీ పరీక్షల్లో మంచి మార్కులు రావటం లేదు. పరీక్షల టైమ్‌లో కూడా.. నేను చదువుకుంటున్నానన్న ఆలోచన కూడా లేకుండా అమ్మానాన్న ఏదో ఒక కారణంతో తగాదా పడుతూనే ఉంటారు. నా కళ్లముందే.. కొన్నిసార్లు నాన్న అమ్మను కొడుతుంటారు కూడా. అప్పుడు నాకు ఏడుపొస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మానాన్న గొడవల్లో నేను, నా తమ్ముడు నలిగిపోతున్నాం’ అని ఆ అమ్మాయి ఉత్తరం ముగించింది.
ఇలాంటి చిన్నారులు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లంతా చెప్పేది ఒక్కటే..
‘ఆలోచించండి.. ఓ అమ్మానాన్నా.. ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా..’