ఏజీఆర్‌ బకాయిలు: చట్టం ముందు అందరూ సమానులే!!

Govt cannot exempt public sector units from AGR - Sakshi

టెలికం ఆపరేటర్ల సవరించిన  స్థూల ఆదాయ (ఏజీఆర్‌) చెల్లింపులకు సంబంధించి టెలికం వివాదాల పరిష్కార అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) కీలక రూలింగ్‌ ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ–ప్రైవేటు రంగాలను వేర్వేరుగా చూడద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ రంగ కంపెనీలు (పీఎస్‌యూ) తమ ఆదాయాల్లో టెలికం సంబంధిత సేవల నుంచి పొందుతున్న మొత్తం చాలా తక్కువనే ప్రాతిపదికన వాటిని ఏజీఆర్‌ వాటాను చెల్లించకుండా మినహాయించరాదని కేంద్రానికి  ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది.  

ఏ మినహాయింపు అయినా ప్రైవేటు రంగ సంస్థలకు ఇచ్చేటట్లయితేనే, వాటిని ప్రభుత్వ రంగ కంపెనీలకు వర్తింపజేయాలని సూచించింది. మరోమాటలో చెప్పాలంటే, ప్రభుత్వ రంగానికి ఇచ్చే మినహాయింపులను ప్రైవేటు రంగ సంస్థలకూ వర్తింపజేయాలని సూచించింది. ఏజీఆర్‌ ద్వారా కేంద్రానికి దాదాపు రూ.4 లక్షల కోట్ల ఆదాయం ఒనగూరుతున్న సంగతి తెలిసిందే. ఏజీఆర్‌ను సవాలుచేస్తూ, దాఖలైన పిటిషన్లను సైతం 2019 అక్టోబర్‌ 24న సుప్రీంకోర్టు కొట్టివేసింది.  

13 సంస్థలపై ప్రభావం 
ట్రిబ్యునల్‌ చైర్మన్‌ శివ కీర్తి సింగ్,  సభ్యుడు సుబోధ్‌ కుమార్‌ గుప్తా ఇచ్చిన తాజా ఉత్తర్వులు టెలికం రంగం లేదా సంబంధిత  సేవల లైసెన్సులు పొందిన పదమూడు ప్రభుత్వ రంగ కంపెనీలపై దీర్ఘకాలిక  ప్రభావాలను చూపుతుందని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కంపెనీలకు ఏజీఆర్‌ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ఆయిల్‌ ఇండియా, రైల్‌టెల్‌ కార్పొరేషన్, పవర్‌గ్రిడ్, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా, నోయిడా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్, గెయిల్‌ ఇండియా, ఢిల్లీ మెట్రో, ఓఎన్‌జీసీ, తమిళనాడు అరసు కేబుల్‌ టీవీ కార్పొరేషన్, గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్‌ ఉన్నాయి. 

ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌లు కూడా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల నుంచి మినహాయింపు పొందాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు కావడం, దీనికితోడు బలహీనమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ మినహాయింపులు పొందాయి. సుప్రీంకోర్టు 2019 అక్టోబర్‌ 24న ఇచ్చిన రూలింగ్‌ను ఉదహరిస్తూ,  నెట్‌మ్యాజిక్‌ సొల్యూషన్స్, డేటా ఇంజీనియస్‌ గ్లోబల్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ట్రిబ్యునల్‌ తాజా తీర్పు వెలువరించింది. ఈ విచారణ సందర్భంగా టెలికం శాఖ వాదనలను 27 పేజీల ఉత్తర్వుల్లో ట్రిబ్యునల్‌ తిరస్కరించింది. పీఎస్‌యూలు ప్రభుత్వ విధులను గణనీయంగా నిర్వర్తించడమే కాకుండా, పబ్లిక్‌ ఫండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాయని, అందువ్లల ప్రజా ప్రయోజనాల రీత్యానే అవి  మినహాయింపునకు అర్హమైనవని పేర్కొనడం ఎంతమాత్రం తగదని స్పష్టం చేసింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top