ఇథనాల్‌ తయారీలో చెరకు రసం వినియోగంపై నిషేధం

Govt asks sugar mills, distilleries to not use sugarcane juice, sugar syrup for ethanol - Sakshi

న్యూఢిల్లీ: ఇథనాల్‌ ఉత్పత్తిలో చెరకు రసం, షుగర్‌ సిరప్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రారంభమైన 2023–24 సరఫరా సంవత్సరానికి (డిసెంబర్‌–నవంబర్‌ మధ్య కాలం) ఇది వర్తిస్తుంది. దేశీయంగా వినియోగానికి తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ’బి–మొలాసిస్‌’ను వినియోగించడానికి అనుమతించింది.

చక్కెర పరిశ్రమ దీన్ని స్వాగతించింది. అయితే ప్రత్యేకంగా చెరకు రసం, షుగర్‌ సిరప్‌ల ఆధారిత ఇథనాల్‌ ఉత్పత్తి యూనిట్లు పని చేయకపోతే అవి ఖాయిలా పడే అవకాశం ఉందని  పేర్కొంది. 2023–24 మార్కెటింగ్‌ సంవత్సరంలో (అక్టోబర్‌–సెప్టెంబర్‌) చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) అంచనాల ప్రకారం 2023–24 మార్కెటింగ్‌ సంవత్సరంలో స్థూలంగా చక్కెర ఉత్పత్తి 9 శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పరిమితం కానుంది. 2022–23 మార్కెటింగ్‌ సంవత్సరంలో భారత్‌ 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల చక్కెర ఎగుమతైంది. ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్‌ సంవత్సరంలో చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top