వాహనాలు, డ్రోన్‌ పరిశ్రమకు పీఎల్‌ఐ స్కీమ్‌ | Sakshi
Sakshi News home page

వాహనాలు, డ్రోన్‌ పరిశ్రమకు పీఎల్‌ఐ స్కీమ్‌

Published Thu, Sep 16 2021 3:41 AM

Govt announces Rs 26000 crore PLI scheme for auto sector - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ పరిశ్రమ, డ్రోన్‌ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐఎస్‌) వర్తింపజేసే ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా రానున్న ఐదేళ్లలో రూ. 26,058 కోట్ల మేర నిధులను కేటాయించనున్నారు.

అధిక విలువతో కూడిన అడ్వాన్స్‌డ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు ఈ పీఎల్‌ఐ స్కీమ్‌ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సామర్థ్యం, గ్రీన్‌ ఆటోమోటివ్‌ వాహనాల తయారీకి ఈ చర్య ఊతమిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ విలేకరుల సమావేశంలో వివరించారు. 2021–22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు మొత్తం 13 రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌ వర్తింపజేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా కేంద్రం ఆటోమోటివ్, డ్రోన్‌ రంగాలకు ఈ స్కీమ్‌ను వర్తింపజేసింది.

అత్యాధునిక ఆటోమోటివ్‌ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను ఈ పథకం పరిష్కరిస్తుంది. సంబంధిత దేశీయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేలా కొత్త పెట్టుబడులను పెట్టేందుకు ఈ ప్రోత్సాహక స్వరూపం దోహదపడుతుంది. ఐదేళ్ల కాలంలో ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్‌ పరిశ్రమలో సుమారు రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్రం అంచనా వేసింది. సుమారుగా రూ. 2.3 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు పెరగడం వల్ల 7.5 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. అలాగే అంతర్జాతీయ ఆటోమోటివ్‌ వాణిజ్యంలో ఇండియా వాటా పెరుగుతుంది.  

రెండు విధాలుగా అమలు..
ఈ పీఎల్‌ఐ స్కీమ్‌ ప్రస్తుతం ఉనికిలో ఉన్న తయారీ సంస్థలకు, కొత్త పెట్టుబడిదారులకు కూడా వర్తిస్తుంది. ఇందులో రెండు కాంపొనెంట్లు ఉన్నాయి. చాంపియన్‌ ఓఈఎం ఇన్సెంటివ్‌ స్కీమ్‌ అమ్మకాల విలువతో అనుసంధానమైన స్కీమ్‌. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ వెహికల్స్‌కు వర్తిస్తుంది. ఇక కాంపొనెంట్‌ చాంపియన్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ అమ్మకాల విలువతో అనుసంధానమై ఉన్న మరో పథకం. ఇది అడ్వాన్స్‌డ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ కాంపొనెంట్స్, సీకేడీ, సెమీ సీకేడీ కిట్స్, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విడిభాగాలకు వర్తిస్తుంది. రూ. 18 వేల కోట్లతో అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌కు ఇప్పటికే పీఎల్‌ఐ స్కీమ్‌ వర్తింపజేసింది. అలాగే రూ. 10 వేల కోట్లతో ఫేమ్‌ స్కీమ్‌ అమలు చేస్తోంది.

డ్రోన్స్‌కు రెక్కలు
పీఎల్‌ఐ పథకంలో భాగంగా డ్రోన్స్, డ్రోన్స్‌కు అవసరమయ్యే విడిభాగాల పరిశ్రమకు దన్నునిచ్చేందుకు సైతం ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు మూడేళ్ల కాలానికిగాను రూ. 120 కోట్లు కేటాయించినట్లు పౌర విమానయాన శాఖ పేర్కొంది. డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాల తయారీలో వేల్యూ ఎడిషన్‌కు గరిష్టంగా 20 శాతంవరకూ ప్రోత్సాహకాలు లభించగలవని తెలియజేసింది. 2021 డ్రోన్‌ నిబంధనల ప్రకారం డ్రోన్ల నిర్వాహకులు నింపవలసిన దరఖాస్తులను 25 నుంచి 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా విప్లవాత్మక ఆధునిక తర టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సాహించనుంది.

మూడేళ్ల కాలంలో డ్రోన్ల పరిశ్రమలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులకు దారి ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. రూ. 1,500 కోట్ల అర్హతగల అమ్మకాలు పెరగవచ్చని, ఇదే విధంగా 10,000 మందికి అదనంగా ఉపాధి లభించగలదని భావిస్తోంది. పథకంకింద డ్రోన్ల విడిభాగాలలో ఎయిర్‌ఫ్రేమ్, ప్రొపుల్షన్‌ సిస్టమ్స్, పవర్‌ సిస్టమ్స్, బ్యాటరీలు, ఫ్లైట్‌ కంట్రోల్‌ మాడ్యూల్, గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్, కెమెరాలు, సెన్సార్లు తదితరాలను చేర్చింది. కాగా.. డ్రోన్ల సంబంధిత ఐటీ ప్రొడక్టుల అభివృద్ధి సంస్థలకు సైతం పీఎల్‌ఐ పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. 2021–22 కేంద్ర బడ్జెట్‌లో పీఎల్‌ఐ పథకానికి అనుమతించిన 13 రంగాలలో భాగంగానే డ్రోన్ల పరిశ్రమను చేర్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement