
రూ.2,400 పెరుగుదల
భౌగోళిక ఉద్రిక్తతలు, టారిఫ్ షాక్‌లు
న్యూఢిల్లీ: పసిడి మరోసారి ర్యాలీ చేసింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 లాభపడి రూ.99,750 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా టారిఫ్‌లపై చేసిన ప్రకటన, భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. జ్యుయలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.2,400 పెరిగి రూ.99,300 వద్ద స్థిరపడింది. ‘‘ట్రంప్ ఫార్మాస్యూటికల్స్‌పై, అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లను ప్రతిపాదించారు.
దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి, అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో సురక్షిత సాధనమైన బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. బుధవారం యూఎస్ ఫెడ్ పాలసీ సమీక్ష వివరాల కోసం మార్కెట్ భాగస్వాములు ఎదురుచూస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో వెండి ధర కిలోకి రూ.1,800 పెరిగి రూ.98,500కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో 3,400 డాలర్లపైకి
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. ఔన్స్‌కు 100 డాలర్ల వరకు పెరిగి 3,422 డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా డాలర్ బలహీనత సైతం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.