కరోనా భయాలకు బంగారం రక్ష

Gold Prices Are Hitting All-Time Highs - Sakshi

పసిడి వైపునకు పెట్టుబడుల పరుగు

అంతర్జాతీయంగా సరికొత్త రికార్డులు అనుసరిస్తున్న దేశీయ ధర

న్యూఢిల్లీ: అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా పసిడి సరికొత్త రికార్డులవైపు దూసుకుపోతోంది. న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌–నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్‌ ఔన్స్‌ (31.1 గ్రా) ధర బుధవారం ఒక దశలో 2,058 డాలర్లకు పెరిగింది. గత ముగింపుతో పోల్చితే దాదాపు 50 డాలర్లు అధికం. ఈ వార్తరాసే 9 గంటల సమయంలో ధర 2,048 డాలర్ల వద్ద (2 శాతం అప్‌) ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ఇది సరికొత్త రికార్డు కావడం గమనార్హం.  తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్‌ చేసిన జూలై 27 తర్వాత కేవలం కొద్దిరోజుల్లోనే  పసిడి 2,050 డాలర్లను దాటేయడం గమనార్హం.  పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు.  

కరోనా నేపథ్యం...
పసిడి అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పసిడి అంతర్జాతీయ డిమాండ్‌ సైతం ఏప్రిల్‌–జూన్‌ మధ్య 11 శాతం పడిపోయినా ( 1,136.9 టన్నుల నుంచి 1,015.7 టన్నులకు )పెట్టుబడులకు సంబంధించి డిమాండ్‌ మాత్రం భారీగా పెరగడం గమనార్హం.   ఎలక్ట్రానిక్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ విషయంలో డిమాండ్‌ 300 శాతం పెరిగి 76.1 టన్నుల నుంచి భారీగా 434.1 టన్నులకు చేరడం గమనార్హం. కారణాలను చూస్తే...

► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ
► కోవిడ్‌ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం
► ఆర్థిక అనిశ్చితి
► అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత  
► వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం
► అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 0.25 శాతం) తగ్గిస్తుందన్న అంచనాలు

దేశీయంగా ఒకేరోజు రూ.1,200కుపైగా అప్‌..
అంతర్జాతీయ ధోరణికి తోడు  రూపాయి బలహీన ధోరణి (బుధవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో 74.94) దేశంలో పసిడి ధరకు బలమవుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాములు 24 క్యారెట్లు స్వచ్ఛత ధర బుధవారం రూ.1,365 పెరిగి రూ.56,181కి ఎగసింది. వెండి సైతం కేజీకి రూ.5,972 ఎగసి, 72,725కు చేరింది. దేశంలోకి పలు స్పాట్‌ మార్కెట్లలో సైతం ధర రూ.1,200కుపైగా పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛత ధర రూ.55,000 దాటిపోగా, ఆభరణాల బంగారం రూ. 53,000పైకి చేరింది. ఈ వార్తరాసే సమయానికి దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత ధర మంగళవారం ముగింపుతో పోల్చితే  దాదాపు రూ.837 ఎగసి పెరిగి రూ.55,388 వద్ద ట్రేడవుతోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top