
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. నెల రోజుల క్రితం అయితే ఏకంగా రూ.లక్షను దాటేసింది. ఆ తర్వాత కాస్త తగ్గినా ఇప్పటికీ రూ.లక్షకు చేరువలోనే ఉంది. దీంతో బంగారం కొనుక్కోవాలని ఆశ ఉన్నప్పటికీ సామాన్యులు మనం కొనలేములే అని ఆగిపోతున్నారు.
సాధారణంగా బంగారం అంటే ఆభరణాల రూపంలోనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అసలే పెరిగిపోయిన ధరకు తోడు ఆభరణాలకు విధించే తరుగు, తయారీ చార్జీలతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. దీంతో కాస్తంత బంగారం కొనాలన్నా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు.
అధిక బంగారం ధర ద్రవ్యోల్బణం వంటిది. డబ్బులు అవే కానీ వాటికి వచ్చే వస్తు ప్రతిఫలం తగ్గిపోతుంది. 2020లో మీ దగ్గర రూ.50,000 ఉంటే పది గ్రాముల బంగారాన్ని కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు 5 గ్రాములు మాత్రమే వస్తుంది. బంగారం కొనడం అనేది ఒక్కసారి చేసే వ్యాయామం కాదు. ఆర్థిక ప్రణాళికలో భాగంగా కాలక్రమేణా దానిని కూడబెట్టుకుంటూ ఉండాలి.
అయితే బంగారాన్ని ఎందుకు కొనాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. అంటే పెట్టుబడి ప్రయోజనాల కోసమా లేదా నగల కోసమా లేకుంటే వివాహ నిమిత్తమా అన్నది ఎరుక ఉండాలి. బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటే 5 నుండి 20 శాతం 'మేకింగ్ ఛార్జీలు' ఉంటాయి. అదే నాణేల రూపంలో కొంటే ఈ అనవసరమైన భారం ఉండదు.
బంగారు నాణేలు కొంటే ప్రయోజనాలు
🔸బంగారు నాణేలు ధ్రువీకరించిన స్వచ్ఛతతో వస్తాయి. సాధారణంగా ఇవి 24 కేరట్లు (99.99 శాతం స్వచ్ఛత)లలో లభిస్తాయి.
🔸కావాల్సినప్పుడు అమ్మి నగదుగా మార్చుకోవచ్చు. వీటిని సులువుగా విక్రయించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వీటిని తీసుకుంటారు.
🔸బంగారం ఆభరణాలతో పోలిస్తే వీటిని భద్రపరచుకోవడం సులువు.
🔸బంగారు నాణేలు ధ్రువీకరణతో రావడం వల్ల స్వచ్ఛత, బరువుకు సంబంధించి ఎలాంటి భయం ఉండదు.
🔸ఆర్థిక అనిశ్చితి సమయాలలో బంగారం విలువకు ఢోకా ఉండదు.
🔸బంగారు నాణేలు అర గ్రాము నుంచి 100 గ్రాముల వరకు వివిధ బరువుల్లో లభిస్తాయి. కాబట్టి స్తోమతను బట్టీ ఎవరి ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు.
🔸నగల దుకాణాలు, ప్రభుత్వ సంస్థల నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు.