బంగారం.. క్రూడ్‌ బేర్‌..!

Gold and Crude prices down fall - Sakshi

50 డాలర్లకుపైగా పసిడి పతనం

ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లపైనే కాకుండా కమోడిటీలపైనా ప్రభావం చూపింది. గత కొద్ది నెలలుగా లాభాల బాటన పయనిస్తున్న పసిడి ధర, న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఔన్స్‌కు (31.1గ్రా) సోమవారం భారీగా పతనమైంది. ఈ వార్త రాసే 10.30 గంటల సమయంలో 50 డాలర్లకుపైగా (3 శాతం) నష్టంతో 1908 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతక్రితం ఒక దశలో కీలక మద్దతుస్థాయి 1900 డాలర్ల దిగువకుసైతం పడిపోయి, 1,886 డాలర్లను కూడా తాకింది.

కరోనా తీవ్రత నేపథ్యంలో పసిడి ధర  తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్‌ చేసిన జూలై 27 తర్వాత ఏ రోజుకారోజు పసిడి పురోగతి బాటనే పయనిస్తూ, వారంరోజుల్లోనే ఆల్‌టైమ్‌ గరిష్టం  2,089  డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు తర్వాత లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. అయితే దీర్ఘకాలంలో పసిడిది బులిష్‌ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర సోమవారం ఈ వార్త రాసే సమయానికి రూ.1,400 నష్టంలో రూ. 50,324 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, మంగళవారం భారత్‌ స్పాట్‌ మార్కెట్లలో ధర భారీగా తగ్గే వీలుంది.  

క్రూడ్‌ కూడా...: మరోవైపు నైమెక్స్‌లో లైట్‌ స్వీట్‌ ధర కూడా బేరల్‌కు 2 శాతం నష్టంతో 39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్‌ ధర కూడా దాదాపు ఇదే స్థాయి నష్టంతో 41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top