యువత పెట్టుబడులకు సరైన వేదిక ఏది?

Getting Started Investing In Your 30s - Sakshi

యువత పెట్టుబడులకు సరైన వేదిక ఏది? – హిమ బిందు 

యుక్త వయసులోనే అంటే ఇరవైలలోనే (ఉదాహరణకు 25 సంవత్సరాలు) సొమ్ములుండి పెట్టుబడులను దీర్ఘకాలంపాటు మరిచిపోగలిగితే స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌తో మదుపును ప్రారంభించవచ్చు. పెట్టుబడిదారులు ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మరీ దీర్ఘకాలానికైతే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ అత్యధిక లాభాలను ఆర్జించిపెట్టే ఆస్తుల విభాగంలోకి వస్తాయి. అయితే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు విలువ భారీగా వేగంగా పడిపోతుంటుంది. ఇది బాగా ఆందోళనలు కలిగిస్తుంది. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ, ఆపై పలు ఇతర క్లిష్టకాలాల్లోనూ వీటి విలువలు 50 శాతం పతనమయ్యాయి. అతితక్కువ సమయంలోనే విలువలు భారీగా క్షీణించాయి. అంటే రూ.100 పెట్టుబడి రూ.50కు చేరుతుంది. అత్యధిక శాతం మంది ఇన్వెస్టర్లు దీనిని ఆమోదించబోరు. కనుక గరిష్ట రిస్కుకు సిద్ధపడితేనే వీటివైపు దృష్టి పెట్టవచ్చు. 

ఇరవైలలోనే మీరు సంపాదిస్తూ, పన్నులు చెల్లిస్తూ ఉంటే లెక్కల పద్ధతిలో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌లో అవసరమైనంత సొమ్మును మదుపు చేయవచ్చు. దేశీ ఇన్వెస్టర్లకు పన్ను పొదుపు ఫండ్స్‌ చాలానే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మొత్తాన్ని ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే ఇరవైలలోనే సంపాదిస్తూ గరిష్ట రిస్కుకు సిద్ధపడుతుంటే.. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌నూ పరిశీలించవచ్చు. 

పన్ను ఆదాకు పీపీఎఫ్‌ సరైనదేనా? – శంకర్‌  
పీపీఎఫ్‌ పెట్టుబడిదారులకు నా సలహా ఏమంటే.. ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటే కొనసాగించవచ్చు. అలాకాకుండా ఇప్పుడే పెట్టుబడుల కోసం ఆలోచిస్తుంటే అదంత లాభదాయకం కాబోదు. ఎందుకంటే.. పీపీఎఫ్‌ అనేది స్థిర ఆదాయ ఆర్జన కోసం 15ఏళ్ల కాలపు క్రమానుగత పెట్టుబడి పథకం(సిప్‌). 15ఏళకాలానికి ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే.. పీపీఎఫ్‌కంటే ఇతర పన్ను ఆదా ఫండ్స్‌ నుంచి లభించే రిటర్నులే అధికంగా ఉండే వీలుంది. ఇది మొట్టమొదట ఆలోచించవలసిన విషయం. అయితే ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే పెట్టుబడులు కొనసాగించవచ్చు.

వడ్డీ ఆదాయం పన్నురహితంకావడంతో స్థిర ఆదాయ కేటాయింపులు చేపట్టవచ్చు. సుప్రసిద్ధమైన పథకంకావడంతో ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ప్రత్యామ్నాయాల్లో ఇది అత్యుత్తమమైనదిగా భావించవచ్చు. ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ లేదా మార్కెట్‌ ఆధారిత పెట్టుబడుల ఖాతా లేనప్పటికీ చాలా మంది ప్రజలు పీపీఎఫ్‌ ఖాతాను కలిగి ఉన్నారు. నిజానికి దేశీయంగా ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్యతో పోలిస్తే ఇటీవల పీపీఎఫ్‌ పెట్టుబడిదారుల సంఖ్య రెట్టింపునకంటే అధికంగా నమోదైంది. ప్రభుత్వ అండతో అత్యంత నమ్మకమైన పెట్టుబడి మార్గంకావడంతో అత్యధికులు పీపీఎఫ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. వడ్డీ ఆదాయం పూర్తిగా పన్నురహితంకావడం ఆకర్షణీయం. వెరసి ఇప్పటికే పీపీఎఫ్‌లో ఉంటే కొనసాగించండి. కొత్తగా ఇన్వెస్ట్‌ చేయదలిస్తే ఇతర పన్నుఆదా ఫండ్స్‌నూ పరిశీలించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top