జెన్‌జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు | Gen Z Redefining Food Industry Labels Health Conscious Choices | Sakshi
Sakshi News home page

జెన్‌జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు

Jun 13 2026 9:30 AM | Updated on Jun 13 2026 10:44 AM

Gen Z Redefining Food Industry Labels Health Conscious Choices

నిన్నటివరకు కేవలం గాడ్జెట్లు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఎంపికలకే పరిమితమనుకున్న ‘జెన్-జీ’ వినియోగదారుల ప్రభావం.. ఇప్పుడు ఫుడ్‌ బ్రాండ్లకు పాకింది. దశాబ్దాల చరిత్ర గల ప్రముఖ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు సైతం ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోక తప్పడం లేదు. కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, ప్రొడక్ట్ లేబులింగ్, సరికొత్త ఉత్పత్తుల రూపకల్పన.. ఇలా ప్రతి నిర్ణయాన్నీ ఈ తరం యువ వినియోగదారులే శాసిస్తున్నారని పరిశ్రమవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

దేశీయ వినియోగంలో 35 శాతం వీరిదే!

ఇప్సోస్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఫుడ్‌ వినియోగ వ్యయంలో దాదాపు 35 శాతం వాటా 15 నుంచి 20 ఏళ్ల పైబడిన జెన్-జీ యువతదే. ఆరోగ్యం, డిజిటల్ పరిజ్ఞానం, పర్యావరణ స్పృహ వంటి అంశాలే వీరి ఎంపికలను నిర్ణయిస్తున్నాయి.

లేబుల్స్ చదువుతున్నారు.. ప్రశ్నిస్తున్నారు!

ఒకప్పుడు బ్రాండ్ పేరు చూసి వస్తువులు కొనేవారు. కానీ నేటి తరం ఆలోచనా విధానం వేరుగా ఉంది. దీనిపై ఎమ్‌టీఆర్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘కాలేజీకి వెళ్లే నా కుమారుడు, అతని స్నేహితులు ఏ ప్రొడక్ట్ కొన్నా.. బ్రాండ్‌తో సంబంధం లేకుండా వెనుక వైపు ఉన్న లేబుల్‌ను నిశితంగా పరిశీలించడం స్వయంగా చూశాను. నేను మార్కెట్ విజిట్స్‌కి వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గమనిస్తుంటాను. యువ వినియోగదారులు షాపింగ్ మాల్స్‌లో నిలబడి లేబుల్స్‌ను పోల్చి చూస్తూ ఆ ప్రొడక్ట్‌లో ఏమేం పదార్థాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. బ్రాండ్లు చెప్పే మాటలను నమ్మడం లేదు. చదువుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఆపైనే నిర్ణయం తీసుకుంటున్నారు’ అని విశ్లేషించారు.

ఫ్యూచర్-రెడీ దిశగా దిగ్గజ కంపెనీలు

యువతను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా మారిపోతున్న ట్రెండ్‌ను మారికో ఎండీ సౌగతా గుప్తా వివరిస్తూ.. ‘మేము ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు సంస్థను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలంటే.. మా ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో కచ్చితంగా జెన్-జీ, మిలీనియల్స్ అభిరుచులకు అనుగుణంగా ఉండాలి’ అన్నారు. ఇందుకు తగ్గట్టుగానే, మారికో సంస్థ కేవలం మూడు వారాల వ్యవధిలోనే యువతను టార్గెట్ చేసే మూడు డైరెక్ట్-టు-కన్స్యూమర్ బ్రాండ్లను దాదాపు రూ.800 కోట్లతో కొనుగోలు చేసింది.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో..

అంశంశాతం 
తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలనుకుంటున్న జెన్-జీ యువత79%
అరోగ్యం కోసం జీవనశైలిలో గణనీయమైన మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నవారు83%
2022 - 2025 మధ్య కాలంలో భారతదేశంలో ప్లాంట్-బేస్డ్ (మొక్కల ఆధారిత) ఫుడ్ ఇండస్ట్రీ సాధించిన వృద్ధి19%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement