కోవిడే మన కొంప ముంచిందా?!

GDP Shrink Such Level Because Of Covid - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఘోరంగా పడిపోయినట్లు కేంద్ర స్టాటటిక్స్‌ మంత్రిత్వ శాఖ సోమవారం నాడు విడుదల చేసిన గణాంకాలు అద్దం పడుతున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా, ముఖ్యంగా జీడీపీ త్రైమాసిక ఫలితాలను ప్రభుత్వం విడుదల చేస్తోన్న 1996 నుంచి ఇప్పటి వరకు ఎన్నడు లేనంతగా జీడీపీ –23.9 శాతానికి పడిపోయింది. ఇదంతా కోవిడ్‌–19 చేసిన పాపమని పాలకపక్షం బీజేపీ సమర్థించుకోగా, ‘ఆ భగవంతుడు చేసిన పని’ అంటూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దేవుడిపై భారం మోపారు.

నిజమే, మొన్నెన్నడు లేనంతగా జీడీపీ వృద్ధిరేటు కోవిడ్‌ కారణంగా పడిపోయింది. ఆ విషయంలో సందేహం లేదు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ ప్రభావం లేకముందు నుంచే అంటే 2018–2019 ఆర్థిక సంవత్సరం నుంచి దేశ ఆర్థిక పరిస్థితి ఘోరంగా పడిపోతూ వచ్చింది. దేశంలో పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ విధానం వల్ల భారత ఆర్థిక వ్యవప్థ తీవ్రంగా దెబ్బతింటూ వస్తోందని దేశీయ, అంతర్జాతీయ నిపుణులు విశ్లేస్తూనే ఉన్నారు.

కోవిడ్‌ను ఎదుర్కోవడంలో అమెరికాకంటే భారత దేశమే ముందున్నదని, అందుకే అమెరికా ఆర్థిక వ్యవస్థకు కోవిడ్‌ వల్ల తగిలిన దెబ్బకంటే భారత్‌ ఆర్థిక వ్యవస్థకు తగిలిన దెబ్బ తక్కువేనంటూ పాలకపక్ష బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది త్రైమాసికం నాటికి అమెరికా జీడీపీ మైనస్‌ 9.1 శాతం క్షీణిస్తే, భారత్‌ది మైనస్‌ 23.9 శాతానికి క్షీణించింది. ఏ దేశంపై ఎక్కువ ప్రభావం చూపించినట్లు. కోవిడ్‌ వల్ల అన్ని దేశాలతోపాటు భారత్‌ కూడా నష్టపోయిందంటున్నారు.

చైనా తన వృద్ధి రేటును మైనస్‌ 3.2 శాతంతో నియంత్రించుకోగా, రష్యా మైనస్‌ 8.2తో అరిట్టకోగలిగింది. పోనీ చైనా, రష్యా, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకోలేమంటే స్పెయిన్‌ (మైనస్‌ 22.2)కన్నా భారత్‌ ఎందుకు ఎక్కువ నష్టపోయింది? ఈసారి ఆర్థికంగా ఎక్కువ నష్టపోయిన 11 దేశాల జాబితాలో భారత్‌ ఎందుకు అగ్రస్థానంలో ఉంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియకనా, తెలిసినా నిజాలను నిర్భయంగా ఒప్పుకునే ధైర్యం లేకపోవడం వల్లనా? ఎందుకు పాలకపక్ష నాయకులు వాస్తవాలకు మసిపూయాలనుకుంటున్నారు......?

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top