
అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటు ధరలకే
గౌతమ్ అదానీ ప్రకటన
ముంబై: అంతర్జాతీయ ప్రమాణాలతో, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకే అందించే ప్రణాళికలను అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రకటించారు. భారత్‌లో ఆరోగ్యం సంరక్షణ రంగాన్ని మార్చేసే స్వప్నాన్ని ఆయన ఆవిష్కరించారు. సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ – ఆసియా పసిఫిక్ (ఎస్‌ఎంఐఎస్‌ఎస్–ఏపీ) 5వ వార్షిక సమావేశం శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడారు.
భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కంటే.. వ్యవస్థ వ్యాప్తంగా పునర్‌నిర్మాణం అవసరమన్నారు. మూడేళ్ల క్రితం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా హెల్త్‌కేర్, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘హెల్త్‌కేర్ రంగంలో తగినంత వేగం లేకపోవడం వల్ల మేము ఇందులోకి ప్రవేశించలేదు.
ఇప్పుడు ఆ వేగం సరిపడా లేకపోవడంతో అడుగు పెట్టాం’’అని అదానీ తెలిపారు. 1,000 పడకల ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంపస్‌లను తొలుత అహ్మదాబాద్, ముంబైలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్టు గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. కరోనా మాదిరి మహమ్మారి, విపత్తు సమయాల్లో వేగంగా సదుపాయాలను విస్తరించేలా ఇవి ఉంటాయన్నా రు. వైద్య చికిత్సలు, పరిశోధన, శిక్షణకు అత్యుత్తమ కేంద్రాలుగా పనిచేస్తాయంటూ.. మయో క్లినిక్ అంతర్జాతీయ అనుభవం ఈ దిశగా తమకు సాయపడుతుందని అదానీ చెప్పారు. నేడు గుండె జబ్బులు, మధుమేహం కంటే కూడా వెన్నునొప్పి ఎక్కువ మందిని వేధిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు.
నచ్చిన చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్
‘నాకు బాగా నచి్చన చిత్రం మున్నా భాయ్ ఎంబీబీఎస్. నవ్వుకోవడానికే కాదు, సందేశం ఇవ్వడానికి కూడా. మున్నాభాయ్ మందులతో కాకుండా, మానవత్వంతో రోగుల బాధలను నయం చేశాడు. నిజమైన వైద్యం సర్జరీలకు అతీతమైనదని ఇది మనందరికీ గుర్తు చేసింది’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.