సామాన్యుడిపై ఇంధన భారం.. | Fuel Price Surge: Rising Petrol, Diesel Costs Hit Common Man Economy Hard | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై ఇంధన భారం..

Jun 3 2026 8:05 AM | Updated on Jun 3 2026 8:44 AM

Fuel Price Surge: Rising Petrol, Diesel Costs Hit Common Man Economy Hard

పెరగనున్న నిత్యావసరాల ధరలు

ఎకానమీకి పెట్రోల్, డీజిల్‌ సెగ

క్రిసిల్‌ నివేదికలో వెల్లడి

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ రేట్లు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రవాణా, తయారీ రంగాల వ్యయాలు పెరిగిపోతుండటం వల్ల రాబోయే రోజుల్లో నిత్యావసరాల ధరలు మరింత ప్రియం కావొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో తెలిపింది. గత నెల 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్‌ రేట్లు లీటరుకు రూ. 7.5 మేర పెరిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్లు అధిక స్థాయిలోనే ఉంటే దేశీయంగా ఇంధనాల రేట్లు మరింత పెరగవచ్చని క్రిసిల్‌ పేర్కొంది.

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో ధరల పెంపు క్రమంగా లీటరుకు రూ. 10 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. దీనితో రవాణా ఖర్చులు పెరిగి ఆహార పదార్ధాలతో పాటు ఇతరత్రా నిత్యావసరాల రేట్లు కూడా పెరిగి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే అవకాశం ఉందని క్రిసిల్‌ తెలిపింది. పెట్రోల్, డీజిల్‌ రేట్లు లీటరుకు రూ. 7.5 చొప్పున పెరగడం వల్ల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంపై 36 బేసిస్‌ పాయింట్ల మేర ప్రభావం ఉంటుందని, అదే రూ. 10 స్థాయిలో ఇంధనాల ధరలు పెరిగితే 48 బేసిస్‌ పాయింట్ల మేర ప్రభావం పడుతుందని వివరించింది.  

రోడ్‌ రవాణాపై భారీ ఎఫెక్ట్‌..

దేశీయంగా రవాణాలో సింహభాగం వాటా (71 శాతం) ఉంటున్న రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌పై ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. రవాణా వాహనాల నిర్వహణ వ్యయాల్లో 42 శాతం వాటా ఇంధనాలదే ఉండటం ఇందుకు కారణం. రిటైల్‌ ఇంధన రేట్లు పెరగడం వల్ల రాబోయే నెలల్లో రవాణా వ్యయాలు, అంతిమంగా వివిధ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని నివేదిక వివరించింది.  

వీటిపై ఎక్కువగా ప్రభావం..

రవాణా కీలకంగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, తేయాకు, కాఫీ, పండ్లు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు, మాంసం, చేపలు మొదలైన ఆహారోత్పత్తులపై అధికంగా ప్రభావం పడనుంది. సానుకూల బేస్‌ ఎఫెక్ట్‌ కూడా తగ్గడం వల్ల రాబోయే త్రైమాసికాల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. దుస్తులు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, కలప ఉత్పత్తులు, సిమెంటు.. సెరామిక్స్‌ సహా నిర్మాణ రంగ మెటీరియల్స్‌కి కూడా రవాణా ప్రధానమైన అంశం కావడం వల్ల వాటిపై కూడా ప్రభావం పడనుంది.  

జీఎస్‌టీ ఉపశమనం కొంతే..

గతేడాది సెప్టెంబర్‌లో వస్తు, సేవల పన్నులను (జీఎస్‌టీ) తగ్గించిన నేపథ్యంలో తాజా ద్రవ్యోల్బణంపరమైన ప్రభావం నుంచి కొంత ఉపశమనం లభించవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఊరట లభించకపోవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించుకున్న 4 శాతం లోపే ఉంటున్నప్పటికీ, రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే తక్కువ వర్షపాతం, ఎల్‌ నినో పరిస్థితులు మొదలైన వాటన్నింటినీ ఆర్‌బీఐ నిశితంగా పరిశీలించి, విధాన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని క్రిసిల్‌ పేర్కొంది.

ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా!

Advertisement
 
Advertisement
Advertisement