ఆర్‌బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!

FPIs pull out net Rs 476 cr so far in Sept from Indian markets - Sakshi

గాంధీ జయంతి.. గురువారం సెలవు 

ఈ వారం నాలుగు రోజులే ట్రేడింగ్‌ 

ఒడిదుడుకులు కొనసాగుతాయని చెబుతున్న నిపుణులు

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ పాలసీ, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్‌కు కీలకాంశాలని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు వాహన విక్రయ గణాంకాలు, మౌలిక, తయారీ  రంగ సంబంధిత  గణాంకాలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు....మార్కెట్‌ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం(వచ్చే నెల2న) సెలవు కావడంతో ట్రేడింగ్‌ ఈ వారం నాలుగు రోజులే జరగనున్నది. మరో వైపు మంగళవారం నుంచి మూడు ఐపీఓలు–యూటీఐ ఏఎమ్‌సీ, మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్, లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల ఐపీఓలు మొదలు కానున్నాయి.  

గురువారం ఆర్‌బీఐ పాలసీ..
మారటోరియం రుణాలపై వడ్డీకి సంబంధించిన కేసు ఈ నెల 28న (నేడు–సోమవారం)సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. బుధవారం (ఈ నెల 30న) ఆగస్టు నెలకు సంబం«ధించిన మౌలిక రంగ గణాంకాలు వెల్లడవుతాయి. వచ్చే నెల 1(గురువారం) ఆర్‌బీఐ పాలసీ వెల్లడి కానున్నది. అదే రోజు వాహన కంపెనీలు సెప్టెంబర్‌ నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. మరోవైపు సెప్టెంబర్‌ నెలకు సంబంధించి తయారీ రంగ పీఎమ్‌ఐ గణాంకాలు కూడా గురువారమే రానున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లండ్‌ల జీడీపీ గణాంకాలు, అమెరికాకు సంబంధించి పీఎమ్‌ఐ గణాంకాలు వెల్లడవుతాయి.  

ఒడిదుడుకులు కొనసాగుతాయ్‌....
గత శుక్రవారం రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకున్నా, యూరప్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఆర్థిక అనిశ్చితి  కొనసాగుతుండటంతో మార్కెట్లో ఒడిదుడుకులకు అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు.

రూ. 476 కోట్ల విదేశీ నిధులు వెనక్కి....
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.476 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత వారంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.10,491 కోట్లు నికర అమ్మకాలు జరిపారు. యూరప్, ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల అప్రమత్తతను ఇది సూచిస్తోందని నిపుణులంటున్నారు. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ ఈక్విటీ మార్కెట్‌ నుంచి నికరంగా  రూ.4,016 కోట్లు ఉపసంహరించుకోగా, డెట్‌ మార్కెట్లో నికరంగా రూ. 3,540 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. మొత్తం మీద నికరంగా రూ.476 కోట్లు  ఉపసంహరించుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top