ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ డౌన్‌

FPIs investment value in Indian equities drops 11percent to 584 billion dollers - Sakshi

డిసెంబర్‌కల్లా 11 శాతం క్షీణత

584 బిలియన్‌ డాలర్లకు పరిమితం

న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల విలువ 2022 డిసెంబర్‌కల్లా 11 శాతం క్షీణించింది. మార్నింగ్‌స్టార్‌ నివేదిక ప్రకారం 584 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఈ విలువ 2021 డిసెంబర్‌లో 654 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇందుకు ప్రధానంగా దేశీ స్టాక్‌ మార్కెట్ల రిటర్నులు నీరసించడం, ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లడం వంటి అంశాలు ప్రభావం చూపాయి. అయితే త్రైమాసికవారీగా చూస్తే ఎఫ్‌పీఐల పెట్టుబడులు 3 శాతం బలపడ్డాయి.

2022 సెప్టెంబర్‌కల్లా 566 బిలియన్‌ డాలర్లుగా నమోదుకాగా.. డిసెంబర్‌కల్లా 584 బిలియన్‌ డాలర్లకు పుంజుకున్నాయి. కాగా.. దేశీ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల వాటా సెప్టెంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌కల్లా 16.97 శాతం నుంచి 17.12 శాతానికి మెరుగుపడింది. 2020, 2021 కేలండర్‌ ఏడాదుల్లో వృద్ధి చూపిన గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లు 2022లో కుదుపులు చవిచూసిన విషయం విదితమే. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఈ బాటలో దేశీయంగానూ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. అయినప్పటికీ ప్రపంచంలోనే దేశీ మార్కెట్లు సానుకూల రిటర్నులు ఇచ్చిన జాబితాలో నిలవడం గమనార్హం!

4.5 శాతం ప్లస్‌
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 4.5 శాతం లాభపడగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.4 శాతం పుంజుకుంది. అయితే స్మాల్‌ క్యాప్‌ 1.8% నష్టపోయింది. 2022లో పలు ప్రతికూలతల నడుమ దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top