breaking news
domestic equities
-
ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల విలువ 2022 డిసెంబర్‌కల్లా 11 శాతం క్షీణించింది. మార్నింగ్‌స్టార్ నివేదిక ప్రకారం 584 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఈ విలువ 2021 డిసెంబర్లో 654 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందుకు ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల రిటర్నులు నీరసించడం, ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లడం వంటి అంశాలు ప్రభావం చూపాయి. అయితే త్రైమాసికవారీగా చూస్తే ఎఫ్‌పీఐల పెట్టుబడులు 3 శాతం బలపడ్డాయి. 2022 సెప్టెంబర్‌కల్లా 566 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా.. డిసెంబర్‌కల్లా 584 బిలియన్ డాలర్లకు పుంజుకున్నాయి. కాగా.. దేశీ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల వాటా సెప్టెంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌కల్లా 16.97 శాతం నుంచి 17.12 శాతానికి మెరుగుపడింది. 2020, 2021 కేలండర్ ఏడాదుల్లో వృద్ధి చూపిన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు 2022లో కుదుపులు చవిచూసిన విషయం విదితమే. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఈ బాటలో దేశీయంగానూ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. అయినప్పటికీ ప్రపంచంలోనే దేశీ మార్కెట్లు సానుకూల రిటర్నులు ఇచ్చిన జాబితాలో నిలవడం గమనార్హం! 4.5 శాతం ప్లస్ బీఎస్ఈ సెన్సెక్స్ 4.5 శాతం లాభపడగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పుంజుకుంది. అయితే స్మాల్ క్యాప్ 1.8% నష్టపోయింది. 2022లో పలు ప్రతికూలతల నడుమ దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయి. -
ఈక్విటీల్లో పన్ను ప్రయోజనం..!
ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోకి అడుగు పెట్టాం. వేతన జీవి తన ఆదాయం, పన్ను భారం, పన్ను ఆదా చేసుకోవడానికి ఇంకా వెసులుబాటు ఉందా? ఉంటే ఏ సాధనంలో ఇన్వెస్ట్ చేయాలి..? ఇలాంటి అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలించుకోవాలి. చాలా మంది ఆర్థిక సంవత్సరం చివర్లోనే పన్ను అంశాన్ని పట్టించుకుంటుంటారు. హడావుడిగా ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేసుకునే వారూ ఉన్నారు. కొత్త పన్నువిధానంలోకి మారిన వారికి ఈ పెట్టుబడులపై హడావుడి అవసరమే లేదు. నూతన విధానంలో పన్ను మినహాయింపులు పెద్దగా లేవు. అదే సమయంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, గతం నుంచి ఉన్న పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80సీసీబీ, 80డీ ఇలా ఎన్నో సెక్షన్ల కింద గణనీయమైన పెట్టుబడి ఆదాకు అవకాశం ఉంది. వీటి గురించి ఓ సారి సమీక్షించుకోవాల్సిందే. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకపోవడం మినహాయింపుల్లో అతి ముఖ్యమైన విభాగం. ఈ ప్రయోజనం కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. లక్ష్యాలు ముఖ్యం.. పెట్టుబడికి సంబంధించి ఏ నిర్ణయమైనా అది మీ ఆర్థిక లక్ష్యానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. పన్ను ఆదాను అదనపు ప్రయోజనంగా చూడాలే కానీ, దానినే ఒక లక్ష్యంగా భావించకూడదు. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి మీరు ఇతర పథకాలలో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. పన్ను ఆదా కోసం తిరిగి ఈఎల్ఎస్ఎస్ తరహా ఈక్విటీ సాధనాల వైపు చూడడం సరికాదు. అప్పుడు ఒకే విభాగంలో (ఈక్విటీల్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం) అధిక రిస్క్ (కాన్సంట్రేషన్ రిస్క్) తీసుకున్నట్టు అవుతుంది. సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షలపై పన్ను ఆదాకోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు ఆఫర్ చేసే ఐదేళ్ల ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అన్నీ కూడా ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఉంది. కాకపోతే ఇందులో పెట్టుబడులకు 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలం కోసం దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, వేతన జీవులు ఈపీఎఫ్‌కు ప్రతీ నెలా చేసే జమను పరిగణనలోకి తీసుకోవాలి. తనకు, తన జీవిత భాగస్వామి లేదా చిన్నారులకు సంబంధించి జీవిత బీమా ప్రీమియంపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు (గరిష్టంగా ఇద్దరు పిల్లలకే), గృహ రుణానికి సంబంధించి అసలుకు చేసే చెల్లింపులను కూడా చూపించుకోవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూడండి. రూ.1.5 లక్షల మొత్తానికి తగ్గితే అప్పుడు.. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఉత్పత్తిని అర్థం చేసుకోవాలి.. ఈఎల్ఎస్ఎస్లో లాకిన్ పీరియడ్ తక్కువగా (మూడేళ్లు) ఉండడం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. లాకిన్ పీరియడ్‌లో ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేరు. సెక్షన్ 80సీ కింద అనుమతి ఉన్న కొన్ని సాధనాల నుంచి నిర్ధేశిత కాలవ్యవధికి ముందే వైదొలగొచ్చు. ఇందుకు జరిమానా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే.. మొత్తం పెట్టుబడి నుంచి 11.5 శాతాన్ని మినహాయిస్తారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై 2 శాతం వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఈపీఎఫ్, పీపీఎఫ్ పథకాల నుంచి పన్ను ఆదా పొందిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. గతంలో పొందిన ప్రయోజనంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఎన్ఎస్సీ పెట్టుబడిని ఐదేళ్లకు ముందుగా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. కేవలం డిపాజిట్‌దారు మరణించిన సందర్భాల్లోనే ఉపసంహరణకు అనుమతిస్తారు. ముందు నుంచే ప్రణాళిక.. ఒకవేళ ఈఎల్ఎస్ఎస్ మీకు అనుకూలమైన సాధనం అని భావించినట్టయితే.. పెట్టుబడులకు ముందు నుంచే ప్రణాళిక రచించుకోవాలి. దేశీయ ఈక్విటీలు గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. కనుక పన్ను ఆదా కోసం ఏక మొత్తంలో పెట్టుబడి సూచనీయం కాదు. జనవరి నుంచి మార్చి వరకు మూడు విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. తదుపరి ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ప్రతీ నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. దీనివల్ల పెట్టుబడి వ్యయం సగటుగా మారి అధిక రాబడులకు అవకాశం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మార్కెట్లలో ఉండే ఆటుపోట్లను సులభంగా అధిగమించి, పెట్టుబడులపై వాటి ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. ఫండ్స్ పథకాల పనితీరును ముందుగానే సమగ్రంగా సమీక్షించుకుని పెట్టుబడులు ప్రారంభించాలి. ఆ పథకాల్లోనే దీర్ఘకాలం పాటు (ఏవైనా అసాధారణ మార్పులు వస్తే తప్ప) కొనసాగాలి. అంతేకానీ, ప్రతీ ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను ఆదా పథకాలను ఎంపిక చేసుకోవడం సరికాదు. ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యం పరిమితి దాటకుండా చూసుకోవాలి. పన్ను బాధ్యతను చూడాలి.. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు రూ.1.5లక్షలపై ఏటా పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ, వీటిని తిరిగి వెనక్కి తీసుకునే సమయంలో లాభాలపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేదు. కనుక లాకిన్ ముగిసిన అనంతరం ఏటా రూ.లక్ష వరకే వెనక్కి తీసుకోవడం ద్వారా అప్పుడు కూడా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలోనూ పన్ను ఉండదని కోరుకునే వారు.. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎండోమెంట్ జీవిత బీమా సాధనాల వంటి వా టికే పరిమితం కావాల్సి ఉంటుంది. అలాగే, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఏటా రూ.2.5 లక్షల పెట్టుబడికి సైతం పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర పన్ను ఆదా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో రాబడుల పరంగా ఈఎల్ఎస్ఎస్ మెరుగైన సాధనం. కనుక దీర్ఘకాల లక్ష్యాల కోసం పన్ను ఆదాతోపాటు, రాబడిని దీని ద్వారా సమకూర్చుకోవచ్చు. ఇందులోనూ గ్రోత్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ సాధనం కనుక పెట్టుబడి అవసరమైన సందర్భంలో (లాకిన్ ముగిసిన అనంతరం) వెనక్కి తీసుకోవాలంటే.. అదే సమయంలో మార్కెట్లు పతనాలను చూస్తుంటే కొంతకాలం వేచి చూడాల్సిన రిస్క్ ఇందులో ఉంటుంది. -
డిసెంబర్‌కల్లా 8,000కు నిఫ్టీ..!
ముంబై: ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 8,000 పాయింట్ల మైలురాయిని తాకుతుందని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ తాజాగా అంచనా వేసింది. దేశీ ఈక్విటీలపై బుల్లిష్‌గా ఉన్నామని, భవిష్యత్‌లో మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొంటుందని భావిస్తున్నామని యూబీఎస్ విశ్లేషకులు గౌతమ్.సి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నారని, దీంతో ప్రీమియం విలువలకు మార్కెట్లు చేరతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమయానుకూల(సైక్లికల్) ఆర్థిక రికవరీను సూచిస్తూ గణాంకాలు వెలువడుతున్నాయని, వెరసి 2014 చివరికల్లా నిఫ్టీ 8,000 పాయింట్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని నివేదికలో అంచనా వేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పలు సంస్కరణలకు తెరలేపిందని నివేదికలో యూబీఎస్ పేర్కొంది. వీటిని మార్కెట్ పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. బిజినెస్‌కు స్నేహపూర్వక వాతావరణం కల్పించడం, కార్మిక సంస్కరణలు, పర్యావరణ, అటవీ అనుమతులకు ఈ క్లియరెన్స్ సౌకర్యాలు, ప్రస్తుత గనుల్లో ఉత్పత్తి పెంపునకు ఆటోమేటిక్ అనుమతులు తదితర పలు చర్యలను నివేదికలో యూబీఎస్ ప్రధానంగా ప్రస్తావించింది. ఇవికాకుండా రైల్వే, బీమా, రక్షణ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐలు) తెరలేపడం, రియల్టీ, ఇన్ఫ్రా రంగాల ట్రస్ట్‌లకు వీలు కల్పించడం వంటి అంశాలను కూడా పేర్కొంది.