
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సూపర్ ఇంటలిజెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ముందుకుసాగుతున్న తరుణంలో కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి. కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వస్తున్న సమయంలో అంతర్గతంగా ఆ ఉద్యోగి ఈమెయిల్ పంపించాడు. దీనిలో కంపెనీ కృత్రిమమేధ విభాగం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాడు.
ది ఇన్ఫర్మేషన్‌లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్ రాసిన కథనంలో మెటాలోని సంస్కృతిని సంస్థ అంతటా వ్యాపిస్తున్న ‘మెటాస్టాటిక్ క్యాన్సర్’తో పోల్చాడు. మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్లపై పనిచేసే బృందంలో బ్లాంకెవర్ట్ కూడా కొంతకాలం పని చేశాడు. ఉద్యోగం నుంచి నిష్క్రమించే ముందు అతడు మెటా నాయకత్వాన్ని, అక్కడి పని విధానాన్ని విమర్శిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు.
‘మెటాలో పని చేస్తున్నన్ని రోజులు చాలా మంది ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. అక్కడ భయంతో కూడిన సంస్కృతి ఉంది. తరచుగా పనితీరు సమీక్షలు, తొలగింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, సృజనాత్మకతను దెబ్బతీశాయి. ప్రస్తుతం 2 వేల మందికిపైగా బలంగా ఉన్న ఏఐ విభాగానికి దిశానిర్దేశం కొరవడింది. చాలా మందికి మెటాలో పని చేయడం ఇష్టం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు. పదేపదే అంతర్గత విభేదాలు, అస్పష్టమైన లక్ష్యాలు నిర్దేషిస్తారు. ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో పనిచేయకపోవడం మాత్రమే కాదు. మెటాస్టాటిక్ క్యాన్సర్‌లా ఇది సంస్థను ప్రభావితం చేస్తుంది’ అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..
ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైట్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మెటా తన ఏఐ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) నిర్మాణంపై దృష్టి సారించే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగాన్ని కంపెనీ ఇటీవల సృష్టించింది. మెటా పరిశ్రమ అంతటా అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించుకుంటోంది. అందుకు కంపెనీ ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడడంలేదు.