భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..!

Ford To Stop Manufacturing Cars In India - Sakshi

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ మోటార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫోర్డ్‌ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత్‌లో ఫోర్డ్‌ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనంద్‌, చెన్నై నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్‌ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్‌లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదేనండోయ్‌..!

లాభాలకంటే నష్టాలే ఎక్కువ..!
2021 నాల్గవ త్రైమాసికం నాటికి గుజరాత్‌లోని సనంద్‌లో వాహనాల తయారీని,  2022 రెండవ త్రైమాసికానికి చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తుందని ఫోర్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎమ్‌ మోటార్స్‌ తరువాత భారత్‌ నుంచి వైదొలుగుతున్న రెండో కంపెనీగా ఫోర్డ్‌ నిలిచింది. 2017లో జనరల్‌ మోటార్స్‌ భారత్‌లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత 10 సంవత్సరాలలో  2 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా నిర్వహణ నష్టాలను ఫోర్డ్‌ చవిచూసింది.  భారత్‌లో  స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణ చర్యలు తీసుకున్న పెద్ద ఉపయోగం లేకుండా పోయింది.

తాజాగా ఫోర్డ్‌ తీసుకున్న నిర్ణయం కంపెనీలో పనిచేసే 4 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది.  కోవిడ్ -19 లాక్‌డౌన్‌,  డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోతో ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థగా తయారైంది. జులై నాటికి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) షేర్ చేసిన డేటా ప్రకారం ఫోర్డ్ రెండు ప్లాంట్లలో ఉన్న 450,000 యూనిట్ల ఇన్‌స్టాల్ చేయబడిన సామర్థ్యంలో కేవలం 20 శాతం యూనిట్లను మాత్రమే ఆపరేట్‌ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఫోర్డ్‌ ఇప్పటివరకు భారత్‌లో సుమారు రెండు బిలియన్‌ డాలర్లపైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200,000   యూనిట్లు,  340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాలలో విస్తరించి ఉండగా,  సంవత్సరానికి 240,000 యూనిట్లు,  270,000 ఇంజిన్‌ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ 1.57 శాతం మార్కెట్ వాటాతో, భారత అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో ఫోర్డ్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఫోర్డ్‌   ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్  భారత్‌లో ఐదు మోడళ్లను విక్రయిస్తుంది 
చదవండి: BMW i Vision AMBY : ది సూపర్​ ఎలక్ట్రిక్‌ సైకిల్..! రేంజ్‌ తెలిస్తే షాక్‌..!​

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top