సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం హైదరాబాద్‌లో జిల్లాలో నాలుగు రోజుల వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఈ నెల 9 నుంచి 12 వరకు వైన్ షాపులు మూత పడనున్నాయి. నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు (నవంబర్ 12) వరకు కొనసాగనున్నాయి.
కాగా, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టి సర్వశక్తులూ లొడ్డుతుండటంతో అందరి దృష్టి జూబ్లీహిల్స్‌పై పడింది. ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా సాక్షాత్తూ పార్టీ రాష్ట్ర రథ సారథులు, కేంద్ర, రాష్ట్ర ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు యావత్ పార్టీ యంత్రాంగాలు రంగంలోకి దిగి ప్రచారం హోరెత్తిస్తుండటంతో గెలుపోటములపై ఉత్కంఠ పెరుగుతోంది.
రాష్ట్రంలో ప్రధాన పక్షాల రాజకీయ భవిష్యత్తు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండటం బెట్టింగ్లకు మరింత ఆజ్యం పోస్తోంది. అధికార పక్షం రెండేళ్ల పాలనను రిఫరెండం, బీఆర్ఎస్ భవిష్యత్తు ఆరాటం, బీజేపీ రాబోయే అధికార పగ్గాల సంకేత ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి వాస్తవంగా ఇక్కడ మూడు పార్టీలకు గెలుపు ఎంతో కీలకం. బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో పోరు కూడా మరింత ప్రతిష్టాత్మకంగా తయారైంది. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా గెలుపు ఓటములపై పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.


