సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని దుబ్బ తండాలో గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముస్తాబైన పంచాయతీ కార్యాలయం – సాక్షి ఫొటోగ్రాఫర్ సూర్యాపేట
సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు 12,702 గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి.
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతామని, గ్రామాభివృద్ధికి పాటుపడతామని దైవసాక్షిగా ప్రమాణం చేయనున్నారు.
తొలి సమావేశం నేడే
ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే.. నూతన సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెండేళ్ల నిరీక్షణకు తెర..
గ్రామ పంచాయతీల గడువు ముగిసి రెండేళ్లు దాటినా, వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఇన్నాళ్లూ పల్లె పాలన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగింది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఫలితాలు వెలువడటంతో గ్రామాలు మళ్లీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత పాలకవర్గాలు బాధ్యతలు చేపడుతుండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.


