స్టార్టప్‌లతో జత కలవండి, లేదంటే మీరు ఉన్న చోటే ..ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

FM Nirmala Sitharaman asks India Inc to partner with startups use tech solutions - Sakshi

న్యూఢిల్లీ: స్టార్టప్‌లతో జత కలసి, అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాటి సొల్యూషన్లు వినియోగించుకోవాలని దేశీ పరిశ్రమలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పారిశ్రామిక వేదిక-సీఐఐ మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో ఆర్థికమంత్రి ప్రసంగించారు. పెట్టుబడుల ఇతోధికానికి వీలుగా సంప్రదాయానికి భిన్నమైన ఆలోచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా  కోరారు.

‘‘స్టార్టప్‌లు వాటి సొల్యూషన్ల వేగాన్ని గమనిస్తే.. నిజానికి అవి మీ కోసమే. వారు సొల్యూషన్లను ఆవిష్కరించినంత వేగంగా మీరు కూడా ముందుకు కదలాలి. లేదంటే మీరు ఉన్న చోటే ఉంటారు. అప్పుడు అవి నూతన ఇండస్ట్రీ లేదా వ్యాపారాన్ని వెతుక్కుంటూ వెళతాయి. అందుకే ఉత్పత్తులు లేదా టెక్నాలజీ అవసరాల కోసం స్టార్టప్‌లతో కలసి పనిచేయాలి’’ అని ఆమె సూచించారు. ఉదయించే కొత్త రంగాలకు పీఎల్‌ఐ పథకం మంచి ప్రోత్సాహకంగా పేర్కొన్నారు. పీఎల్‌ఐ బయట ఏదైనా మంచి ఉత్ప్రేరకం ఉంటే సూచించాలని కోరారు.  

మూలధన వ్యయాన్ని తగ్గించే బడ్జెట్‌: అరవింద్‌ విర్మాణి 
ఇదిలావుండగా,  2023-24 బడ్జెట్‌లో ద్రవ్య స్థిరీకరణ చర్యలు తీసుకోవడం హర్షణీయ అంశమని నీతి ఆయోగ్‌ సభ్యుడు అరవింద్‌ విర్మాణి ఒక ఇంటర్వూలో పేర్కొన్నారు. భారతీయ కంపెనీలకు మూలధన వ్యయాన్ని తగ్గించడంలో బడ్జెట్‌ ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 6.4శాతానికి కట్టడి చేస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మరింతగా 5.9 శాతానికి తగ్గించాలని బడ్జెట్‌లో నిర్దేశించిన సంగతి తెలిసిందే.

దీనితోపాటు మౌలిక రంగం పురోగతి లక్ష్యంగా మూలధన వ్యయాలను 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేరడం దేశ పురోభివృద్ధికి దోహదపడే అంశమని అన్నారు. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానానికి మళ్లుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది సరికాదని అన్నారు. కొత్త పెన్షన్‌ విధానం ఒక గొప్ప సంస్కరణ అని ఆయన అన్నారు. గత నెల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2022–23 జీడీపీ అంచనాలను 6.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరిగి దీనిని బహుళజాతి బ్యాంకింగ్‌ సంస్థ తిరిగి ఎగువముఖంగా సవరిస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top