Fitch Ratings: దేశ జీడీపీ భారీగా తగ్గింపు, కరోనా వల్లే

Fitch Ratings slashed India from 10percent to 8percent  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.7 శాతానికి తగ్గిస్తూ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ‘ఫిచ్‌ రేటింగ్స్‌’ తన నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా రెండో విడత ఎక్కువ కాలం పాటు ఉండడాన్ని తన అంచనాల తగ్గింపునకు దారితీసిన అంశంగా ఫిచ్‌ తెలిపింది. భారత్‌ జీడీపీ 10 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) వృద్ధిని నమోదు చేయవచ్చని ఈ ఏడాది జూన్‌లో ఫిచ్‌ అంచనా వేయడం గమనార్హం. అప్పుడు కూడా అంతక్రితం అంచనాలను గణనీయంగా తగ్గించేసింది. 
అంతకుముందు వేసిన అంచనా 12.8 శాతంగా ఉంది. కరోనా దెబ్బకు 2020–21లో దేశ జీడీపీ మైనస్‌ 7.3 శాతానికి పడిపోవడం తెలిసిందే. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019–20)లోనూ వృద్ధి 4 శాతానికి పరిమితం అయింది. ‘‘మా అభిప్రాయం మేరకు.. కరోనా రెండో విడత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే.. నిదానించేలా చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను ఈ ఏడాది జూన్‌లో వేసిన 8.5 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నాం’’ అని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది.   

ద్రవ్యలోటు భారీగా.. 
ద్రవ్యలోటు కూడా ఎక్కువగానే ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ భావిస్తోంది. జీడీపీలో 7.2 శాతంగా (పెట్టుబడుల ఉపసంహరణను మినహాయించి చూస్తే) ఉండొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 28న ఒక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. దీని ప్రభావం జీడీపీలో 2.7 శాతం మేర ఉంటుందని ఫిచ్‌ అంచనా. ‘‘అయినప్పటికీ ఆదాయం మంచిగా పురోగమిస్తే కనుక అధిక వ్యయాల భారాన్ని అధిగమించొచ్చు. అప్పుడు ద్రవ్యలోటు కట్టడి సాధ్యపడుతుంది. ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట పరిమిత లక్ష్యం (2–6) స్థాయిలోనే ఉండొచ్చు. అయితే ఇది మోస్తరు స్థాయికి చేరుతుంది. దీంతో ఆర్‌బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది.  

అలా అయితే కష్టం.. 
ప్రభుత్వం కనుక ద్రవ్యలోటును తగినంత స్థాయిలో కట్టడి చేయలేకపోతే అప్పుడు రుణ భారం/జీడీపీ రేషియో మరింత దిగజారుతుందని.. అది జీడీపీ వృద్ధిని బలహీనం చేయవచ్చని ఫిచ్‌ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రభుత్వం సాధారణ రుణ భారాన్ని బీబీబీ స్థాయికి తగ్గించేందుకు.. విశ్వసనీయమైన మధ్యకాలిక ద్రవ్యలోటు విధానాన్ని అమలు చేయడం సానుకూలంగా పేర్కొంది. అదే విధంగా స్థిరమైన అధికస్థాయి పెట్టుబడులు, గరిష్ట వృద్ధి రేటును మధ్యకాలానికి.. ఎటువంటి స్థూల ఆర్థిక అసమానతలు లేకుండా నమోదు చేయడం, నిర్మాణాత్మక సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడం కూడా సానుకూలిస్తుందని ఫిచ్‌ అంచనా వేసింది.  

ఇతర అంచనాలు.. 
ఆర్‌బీఐ సైతం ఈ ఏడాది జూలై నాటి సమీక్షలో దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్‌ జీడీపీ 9.5 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేయగా.. మూడిస్‌ 9.3 శాతంగా పేర్కొంది. ప్రపంచబ్యాంకు కూడా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి అంచనాలను సవరించింది.  

వృద్ధి 9.1%: ఫిక్కీ 
2021–22లో దేశ జీడీపీ 9.1% వృద్ధిని సాధిం చొచ్చని ఫిక్కీ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ సర్వే  తెలిపింది. కరోనా రెండో విడత నుంచి ఆర్థిక వ్యవస్థ మంచిగా పుంజుకుంటుండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. అయితే దీపావళి సమయంలో ప్రజల రాకపోకలు ఎక్కువ అవ్వడం వల్ల కరోనా ఇన్ఫెక్షన్‌ కేసులు పెరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఫిక్కీ సర్వేలో వృద్ధి 9 శాతంగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. నైరుతి సీజన్‌ చివర్లో వర్షాలు మంచిగా పుం జుకోవడం, ఖరీఫ్‌లో సాగు పెరగడం వృద్ధి అంచనాలకు మద్దతునిస్తాయని ఫిక్కీ తెలిపింది. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు, పండుగల సీజన్‌లో విక్రయాలు ఆర్థిక వ్యవస్థ రికవరీపై స్పష్టతనిస్తాయని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top