ఫెడ్‌ నిర్ణయాలు... ఆర్థిక గణాంకాలు కీలకం

Financial statistics are crucial to Fed decisions - Sakshi

ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితం

నేడు అక్టోబర్‌ ఆటో అమ్మక గణాంకాలు వెల్లడి

రేపు ఫెడ్‌ ఫాలసీ కమిటీ సమావేశం ప్రారంభం

దీపావళీ సందర్భంగా గురువారం ముహురత్‌ ట్రేడింగ్‌

ఈ వారం స్టాక్‌ గమనంపై నిపుణుల అంచనా

ముంబై: ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయాలు, స్థూల ఆర్థిక, ఆక్టోబర్‌ ఆటో అమ్మక గణాంకాలు ఈ వారం సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. గురువారం దీపావళీ, శుక్రవారం బలి ప్రతిపద సందర్భంగా ఎక్చ్సేంజీలకు సెలవుకావడంతో ట్రేడింగ్‌ మూడు రోజులే జరుగుతుంది. ‘‘ఫెడ్‌ పాలసీ కమిటీ సమావేశానికి ముందు అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి.

వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. మూడురోజుల పరిమిత ట్రేడింగ్‌లో అమ్మకాలు కొనసాగవచ్చు. నిఫ్టీకి 17,250 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయి ఉంది. నిర్ణయాత్మక ఈ స్థాయిని కోల్పోతే అమ్మకా తీవ్రత మరింత పెరగవచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ద్‌ ఖేమా తెలిపారు.

గతవారంలో సెన్సెక్స్‌ 1,515 పాయింట్లు, నిఫ్టీ 443 పాయింట్లు నష్టపోయాయి. దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాల ప్రకటన, ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.  
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే..,  

నేడు వాహన విక్రయ గణాంకాల వెల్లడి  
దేశీయ ఆటో కంపెనీలు నేడు(సోమవారం) తమ అక్టోబర్‌ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఈ వారంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆశోక్‌ లేలాండ్, ఐషర్‌ మోటర్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, ఎస్కార్ట్స్‌ లాంటి ఆటో కంపెనీల షేర్లు అధిక పరిమాణంతో ట్రేడయ్యే అవకాశం ఉంది. సెమి కండెక్టర్ల కొరత, రవాణా ఛార్జీలు, ముడి సరుకు ధరల పెరుగుదల తదితర అంశాలు వాహన విక్రయాలను పరిమితం చేసి ఉండొచ్చని పరిశమ్ర నిపుణులు భావిస్తున్నారు.

ఫెడ్‌ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి
అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాలు మంగవారం(నవంబర్‌ 2న) మొదలై.., మూడో తేదిన(బుధవారం)ముగియనున్నాయి. రెండురోజుల ఫెడ్‌ పాలసీ సమావేశంలో ఆర్థిక ఉద్దీపనల ఉపసంహరణ(ఫెడ్‌ ట్యాపరింగ్‌), బాండ్ల క్రయవిక్రయాలపై కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్‌ చైర్మన్‌ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది.  

కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు  
దేశీయ కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ నవంబర్‌ మొదటి వారంలోనూ కొనసాగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ, టాటామోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఐషర్‌ మోటార్స్, హెచ్‌పీసీఎల్, దివీస్‌ ల్యాబ్స్, ఐఆర్‌సీటీసీలతో సహా 350కి పైగా కంపెనీలు ఈ వారంలో తమ సెప్టెంబర్‌ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. గతవారంలో కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్న సంగతి తెలిసిందే.

గురువారం ముహురత్‌ ట్రేడింగ్‌
దీపావళి సందర్భంగా గురువారం ఎక్సే్చంజీలకు సెలవు రోజు అయినప్పటికీ.., ఆ రోజు సాయం త్రం ముహూరత్‌ ట్రేడింగ్‌ జరుగుతుంది. ప్రీ ఓపెనింగ్‌ సెషన్‌ 06:00 – 06:08 మధ్య ప్రారంభమవుతుంది. ప్రధాన సెషన్‌ 06:15 నుంచి 07:15 నిర్వహించబడుతుంది. ఎక్చ్సేంజీల సమయ పాలన మినహా ట్రేడింగ్‌ విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నిర్ధిష్ట సమయంలో షేర్లను కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని ట్రేడర్ల విశ్వాసం.

ఈ వారంలో మూడు ఐపీఓలు  
మూడు కంపెనీలు ఈ వారంలో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. పాలసీ బజార్, సంఘీ ఇండస్ట్రీస్, జేఎస్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజస్‌ కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు సోమవారం మొదలైన బుధవారం ముగియనున్నాయి. ఇందులో పాలసీ బజార్‌ రూ. 5,625 కోట్లను, ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.800 కోట్లను, సంఘీ ఇండస్ట్రీస్‌ రూ.125 కోట్ల నిధుల సమీకరించున్నాయి. అలాగే గతవారం ప్రారంభమైన నైకా, ఫినో పేమేంట్స్‌ బ్యాంక్‌ ఐపీఓలు మంగళవారం ముగియనున్నాయి.

అక్టోబర్‌లో అమ్మేశారు
రెండు నెలల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో దేశీయ ఈక్విటీలను అమ్మేశారు. గత నెలలో భారత మార్కెట్‌ నుంచి రూ.12,278 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.13,550 కోట్ల షేర్లను విక్రయించగా.., డెట్‌ మార్కెట్‌లో రూ.1,272 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిట రీ గణాంకాలు తెలిపాయి. ‘‘షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయనే నెపంతో మిర్లేంచ్, యూఎస్‌బీ, నోమురా బ్రోకరేజ్‌ సంస్థలు             భారత ఈక్విటీ మార్కెట్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణకు ఇదొక కార ణం అయ్యిండొచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వీకే విజయ్‌ కుమార్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top