
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. దీని ద్వారా సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించవచ్చు. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రకటించారు. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2025-26 సంవత్సరానికి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధర రూ. 3,000. వినియోగదారుడు రాజ్‌మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) వెబ్‌సైట్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. చెల్లింపులు పూర్తయిన తరువాత యాన్యువల్ పాస్ 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.
ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్.. ప్రైవేట్ కార్లు, జీప్, వ్యాన్‌లు నేషనల్ హైవే (NH) & నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే (NE) టోల్ ప్లాజాల ద్వారా ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందు అయితే అది) ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది.
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం వినియోగదారులు ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. మీ ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్‌లో వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేయవచ్చు.
ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.