
ప్రపంచ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీయంగా హుషారుగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ బోర్లా పడ్డాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో పతనంతో ముగిశాయి. సెన్సెక్స్ 433 పాయింట్లు కోల్పోయి 37,877 వద్ద నిలిచింది. వెరసి 38,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. ఇక నిఫ్టీ 122 పాయింట్లు దిగజారి 11,178 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు తొలుత కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ 38,540 వరకూ ఎగసింది. చివరి రెండు గంటల్లో అమ్మకాలు తలెత్తడంతో 37,655 దిగువకు పతనమైంది. ఇదే విధంగా నిఫ్టీ 11,366- 11,111 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది.
ఫార్మా, మెటల్ అప్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ రంగాలు 2.5 శాతం చొప్పున బోర్లాపడగా.. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియల్టీ, ఐటీ 1.4-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే ఫార్మా, 1.5 శాతం, మెటల్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఐవోసీ, ఇండస్‌ఇండ్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బీపీసీఎల్, మారుతీ, ఐసీఐసీఐ 7-2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, సిప్లా, ఎన్‌టీపీసీ, టైటన్, టాటా స్టీల్, శ్రీ సిమెంట్ 2.6-1 శాతం మధ్య లాభపడ్డాయి.
లుపిన్ జోరు
డెరివేటివ్ కౌంటర్లలో బాలకృష్ణ, బాష్, పీఎఫ్‌సీ, బీవోబీ, భెల్, ఆర్‌బీఎల్, డీఎల్‌ఎఫ్, ఎంఆర్‌ఎఫ్, రామ్‌కో సిమెంట్, ఐబీ హౌసింగ్, గోద్రెజ్ సీపీ, ఐసీఐసీఐ ప్రు, టీవీఎస్ మోటార్ 5.5-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. లుపిన్ 9 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ముత్తూట్, గ్లెన్‌మార్క్, సీమెన్స్, కేడిలా, కమిన్స్, టొరంట్ ఫార్మా 3-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1627 నష్టపోగా.. 1091 మాత్రమే లాభపడ్డాయి.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 416 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 764 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 351 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 940 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.