ఈవీల్లో అన్ని విభాగాల్లోకి వస్తాం

EVs cannot completely displace ICE vehicles in India - Sakshi

చేతక్‌ అంటే అంచనాలు ఎక్కువ

అర్బనైట్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ వాస్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన రంగంలో అన్ని విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తామని అర్బనైట్‌ వెల్లడించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలను అర్బనైట్‌ బ్రాండ్‌లో బజాజ్‌ ఆటో ఆఫర్‌ చేస్తోంది. ఈ–టూ వీలర్స్‌లో ఏటా ఒక కొత్త మోడల్‌ను పరిచయం చేయాలన్నది బజాజ్‌ లక్ష్యమని అర్బనైట్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ వాస్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు బుధవారం తెలిపారు. ‘ఇందుకు అనుగుణంగా నూతన ఉత్పాదనలను అభివృద్ధి చేస్తున్నాం. చేతక్‌ లేదా ఇతర పేర్లతోనూ వాహనాలు రావొచ్చు. ఈవీ వ్యాపారం ఒక దీర్ఘకాలిక క్రీడ. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల వాటా గతేడాది 9 శాతం. ఇప్పుడిది ఏకంగా 20 శాతానికి చేరింది. రెండేళ్లలో మొత్తం స్కూటర్ల విక్రయాల్లో 70 శాతం ఎలక్ట్రిక్‌ కైవసం చేసుకుంటుంది’ అని వెల్లడించారు.  

చేతక్‌ శకం మళ్లీ వస్తుంది..  
నాణ్యతలో రాజీపడని కస్టమర్ల తొలి ప్రాధాన్యత చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అని ఎరిక్‌ అన్నారు. ‘బ్రాండ్‌ను నిలబెట్టడానికి మన్నిక, సాంకేతికత, ఇంజనీరింగ్‌ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎలక్ట్రిక్‌ త్రీ, ఫోర్‌ వీలర్ల విభాగంలోకి రాలేమని చెప్పలేను. చేతక్‌ అంటే అంచనాలు ఎక్కువ. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కిన చేతక్‌ శకం మళ్లీ వస్తుంది. మొబిలిటీ కంపెనీ యూలు వినియోగిస్తున్న 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా తయారు చేసి సరఫరా చేశాం. మొబిలిటీని ఒక సేవగా దేశంలో ప్రోత్సహిస్తాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్‌ టూవీలర్లను అద్దె ప్రాతిపదికన బెంగళూరు, ముంబై, ఢిల్లీలో యూలు ఆఫర్‌ చేస్తోంది. కాగా, నెలకు 200లకుపైగా చేతక్‌ స్కూటర్లను విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక మోబైక్స్‌ ఎండీ కె.వి.బాబుల్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో చేతక్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు మూడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top