జీతం రూ.50 వేలు.. అకౌంట్‌లో పడింది రూ.1.42 కోట్లు !.. ఆ తర్వాత..

Employee Accidentally Gets Paid 286 Times His Salary And He Resigns and Disappears - Sakshi

జీతాలు చెల్లించే విషయంలో కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించకుంటే ఇక్కట​‍్లు తప్పవు అనేందుకు తాజాగా ఉదాహారణ మరొకటి వెలుగులోకి వచ్చింది. శ్రమ దోపిడి లేకుండా పనికి తగ్గ జీతం ఇవ్వడం ఎంత ముఖ్యమో.. నిర్లక్ష్యంగా అధిక మొత్తంలో చెల్లించడమూ కంపెనీలకు ప్రమాదమే. కావాలంటే చిలీ ఏం జరిగిందో మీరే ఓసారి చూడండి.

దక్షిణ అమెరికా ఖండంలో చిలీ దేశం ఖనిజ సంపదకు ప్రసిద్ధి. అక్కడ కన్సార్సియో ఇండస్ట్రియల్‌ డే అలిమెంటోస్‌ అనే ప్రముఖ మైనింగ్‌ సంస్థ ఉంది. ఈ కంపెనీలో వేలాది మంది కార్మికులు వందలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల వేతనాల చెల్లి​ంపు సందర్భంగా ఓ ఉద్యోగికి 500,000 పేసోలు (రూ.50 వేలు) చెల్లించాల్సి ఉంది. అయితే అకౌంట్స్‌ విభాగం చేసిన తప్పుల కారణంగా ఏకంగా  165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా ఆ ఉద్యోగి ఖాతాలో పడ్డాయి.

తప్పు చేశారు
ప్రతీ నెల తనకు వచ్చే జీతం కంటే అనేక రెట్లు ఎక్కువగా వేతనం జమ కావడంతో ఒక్కసారిగా ఆ ఉద్యోగి పరేషాన్‌ అయ్యాడు. వెంటనే అకౌంట్స్‌ విభాగాన్ని సంప్రదించి తనకు 286 రెట్లు అధికంగా జీత పడిందంటూ తెలిపాడు. వెంటనే రికార్డులు పరిశీలించిన అకౌంట్స్‌ విభాగం తప్పును గుర్తించింది. అధికంగా జమ అయిన సొమ్మును వెంటనే కంపెనీ ఖాతాకు పంపాలంటూ కోరింది.

రాజీనామా
మరుసటి రోజు మైనింగ్‌ కంపెనీ అధికారులు ఉద్యోగికి ఫోన్‌ చేసి అధికంగా పడిన సొమ్ము గురించి వాకాబు చేశారు. ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల బ్యాంకుకి వెళ్లడం వీలు పడలేదని. కాసేపట్లో బ్యాంకుకు వెళ్తానంటూ వారికి సమాధానం ఇచ్చాడు. కానీ అదే రోజు అతను బ్యాంకుకు వెళ్లకుండా హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

గాయబ్‌
రెండు రోజులైన ఉద్యోగికి చెల్లించిన అధిక మొత్తం డబ్బులు తిరిగి కంపెనీ ఖాతాలో జమ కాకపోవడంతో మరోసారి సదరు ఉద్యోగితో టచ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అకౌంట్స్‌ సిబ్బంది. కానీ ఫోన్‌, మెసేజ్‌లకు అతను అందుబాటులోకి రాలేదు. ఇంటికి వెళ్లి చూడగా అతను అక్కడ లేడు. మరోవైపు ఆఫీసులు రిజైన్‌ లెటర్‌ ఇచ్చినట్టు తెలిసింది.

నిర్లక్ష్యానికి మూల్యం
యాభై వేల రూపాయల బదులు ఒక కోటి నలభైమూడు లక్షల రూపాయల సొమ్మును అందుకున్న సదరు వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనాయాసంగా తనకు దక్కిన సొమ్ముతో ఊరొదిలి రహస్య ప్రాంతాలకు చేరుకున్నాడు. మరోవైపు అధికంగా సొమ్ము చెల్లించడమే కాకుండా రికవరీలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైనింగ్‌ కంపెనీ ఖజానాకు సుమారు ఒక కోటి నలభై ఒక్క లక్ష రూపాయల మేర చిల్లు పడింది.

చదవండి: రూ.3.5 కోట్ల జీతం బాగుంది కానీ జాబ్‌ బోరుకొడుతోంది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top