
ఎలాన్ మస్క్ తన శాటిలైట్ ఇంటర్నెట్ 'స్టార్‌లింక్' కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఈ సేవలు మనదేశంలో త్వరలోనే ప్రారంభం కానున్నాయని.. కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన స్టార్‌లింక్ చార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే..
భారతదేశంలో స్టార్‌లింక్ సర్వీస్ ప్రారంభమైన తరువాత.. దీని ఛార్జీలు నెలకు 10 డాలర్ల (రూ.850) వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ధరలు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువే అని తెలుస్తోంది. పరిచయ ఆఫర్లతో భాగంగా సంస్థ అపరిమిత డేటాను అందించే అవకాశం ఉంది.
భారతదేశంలో వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పరిచయ ఆఫర్స్ కూడా చాలా తక్కువ ధరకే అందించాలని యోచిస్తోంది. 10 మిలియన్స్ సబ్‌స్క్రైబర్‌లను లక్ష్యంగా చేసుకుని సంస్థ ముందడుగు వేస్తోంది. సబ్‌స్క్రైబర్లు స్టార్‌లింక్ హార్డ్‌వేర్ ప్యాకేజీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో శాటిలైట్ డిష్, వైఫై రూటర్ వంటివి ఉన్నాయి. దీని కోసం ఎంత చెల్లించాలనే విషయం వెల్లడికాలేదు.
ఇదీ చదవండి: ఫేస్ స్కాన్ చేస్తే.. పేమెంట్ పూర్తయిపోయింది: వీడియో
ప్రపంచవ్యాప్తంగా.. స్టార్‌లింక్ సేవలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు దాదాపు 80 డాలర్లు (రూ. 6,800). అయితే కస్టమర్‌లు 349 డాలర్లతో (రూ. 29,700) వన్ టైమ్ రుసుముతో స్టార్‌లింక్ స్టాండర్డ్ కిట్‌ను కూడా కొనుగోలు చేయాలి.