భారీ వరదలు.. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎలా ఉందంటే.. | Sakshi
Sakshi News home page

Dubai Airport: పూర్తిస్థాయి సామర్థ్యానికి దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌

Published Thu, Apr 25 2024 6:10 PM

Dubai Airport Returned To Normal Flight Schedule And Operating 1400 Flights A Day - Sakshi

ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇటీవల కురిసిన వర్షానికి వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఎయిర్‌పోర్ట్‌ పూర్తిస్థాయిలో పనిచేసేలా అక్కడి యంత్రాంగం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. దాంతో దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ పూర్తిసామర్థ్యానికి చేరుకుందని సీఈఓ పాల్‌ గ్రిఫిత్స్‌ ప్రకటించారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ విమానాశ్రయం కార్యకలాపాలపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 75 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదు కాగా, రన్‌వే నీట మునిగింది. దీంతో వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి విమానాశ్రయం సాధారణ స్థితికి వచ్చిందని, రోజుకు దాదాపు 1400 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని గ్రిఫిత్స్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ

విమానాశ్రయం తిరిగి యథావిధిగా పనిచేసేలా కృషి చేసిన వారిని ఉద్దేశించి సీఈఓ మాట్లాడారు. ‘విమానాశ్రయం తిరిగి కార్యకలాపాలు సాగించడంలో సిబ్బంది చాలాచొరవ చూపారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా 2,155 విమానాలు రద్దు చేశాం. 115 ఎయిర్‌క్రాఫ్ట్‌లను దారిమళ్లించాం. దుబాయ్‌లోని రెండు విమానాశ్రయాలు డీఎక్స్‌బీ, డీడబ్ల్యూసీ చుట్టూ నీరు చేరడంతో సామగ్రిని రవాణా చేయడంలో సవాళ్లు ఎదుర్కొన్నాం. రెండు విమానాశ్రయాల్లోని సిబ్బంది, ప్రయాణికులకు 75,000 పైగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. ఎయిర్‌పోర్ట్‌ పునరుద్ధరణకు మా ఎయిర్‌లైన్ భాగస్వాములు, సర్వీస్ ప్రొవైడర్‌లు, ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య భాగస్వాములు, సేవా భాగస్వాములతో కలిసి పని చేయాల్సి వచ్చింది’అని ఆయన అన్నారు.

Advertisement
Advertisement