వైర్‌లెస్‌ జామర్లు, నెట్‌వర్క్‌ బూస్టర్లు విక్రయించొద్దు

DoT warns e-com firms against illegal sale of boosters, jammers - Sakshi

ఈ–కామర్స్‌ సంస్థలకు టెలికం శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ: ప్రభుత్వ అనుమతులు అవసరమయ్యే వైర్‌లెస్‌ జామర్లు, నెట్‌వర్క్‌ బూస్టర్లు వంటి టెలికం పరికరాలను విక్రయించరాదని ఈ–కామర్స్‌ సంస్థలను టెలికం శాఖ (డాట్‌) హెచ్చరించింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులిస్తే తప్ప సెల్యులార్‌ సిగ్నల్‌ జామర్లు, జీపీఎస్‌ బ్లాకర్లు లేదా ఇతరత్రా సిగ్నల్స్‌ను జామ్‌ చేసే పరికరాలను వినియోగించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది.

దేశీయంగా ప్రైవేట్‌ రంగ సంస్థలు లేదా ప్రైవేట్‌ వ్యక్తులు వీటిని కొనుగోలు చేయడం లేదా వినియోగించుకోవడం వంటివి చేయరాదు‘ అని ఒక ప్రక టనలో తెలిపింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న దానికి భిన్నంగా సిగ్నల్‌ జామింగ్‌ పరికరాల ప్రకటనలు ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం, దిగుమతి చేసుకోవడం లేదా ఇతరత్రా మార్కెటింగ్‌ చేయడం వంటివన్నీ కూడా చట్టవిరుద్ధమని పేర్కొంది. గడిచిన 4–5 ఏళ్లుగా డాట్‌ ఈ అంశాన్ని అనేక సార్లు లేవనెత్తింది.

ఈ పరికరాల అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు పలు మార్లు దాడులు కూడా నిర్వహించింది. వైర్‌లెస్‌ జామర్లను విక్రయించడం లేదా వాటి అమ్మకానికి వెసులుబాటు కల్పించడం వంటివి చేయరాదంటూ ఈ–కామర్స్‌ కంపెనీలన్నింటికీ జనవరి 21న డాట్‌ నోటీసు కూడా జారీ చేసింది. మరోవైపు, మొబైల్‌ సిగ్నల్‌ బూస్టర్ల వంటి అక్రమ పరికరాల అనధికారిక వినియోగం వల్ల టెలికం సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడుతోందని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. వీటి వినియోగం చట్టరీత్యా నేరమన్న సంగతి చాలా మంది ప్రజలకు తెలియదని, తాజా ఆదేశాలతో ఈ అంశంపై అవగాహన పెరగగలదని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top