TRAI: టెలీ మార్కెటర్స్‌కు షాక్‌! కాల్‌కు రూ.10వేల దాకా ఫైన్‌

DoT for rs10,000 fine on every call, SMS by pesky callers after 50 violations - Sakshi

పెస్కీ కాల్స్‌తో విసిగిస్తే జరిమానా తప్పదు: ట్రాయ్‌

తొలుత రూ.1,000 జరిమానా

మూడో ఉల్లంఘనకు రూ.10వేల జరిమానా, కనెక్షన్‌ను కూడా రద్దు

సాక్షి, న్యూఢిల్లీ: అవాంఛనీయ కాల్స్, సందేశాలను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు నిబంధనలను కఠినతరం చేసింది. రూ.10,000 వరకు జరిమానా విధింపుతోపాటు, టెలీమార్కెట్లకు కనెక్షన్ల తొలగింపు కూడా ఇందులో భాగంగా ఉండనుంది.  మళ్లి మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదని ట్రాయ్‌ హెచ్చరించింది. 50 ఉల్లంఘనల తరువాత టెలిమార్కెటర్లు చేసే ప్రతీకాల్‌, లేదా ఎస్‌ఎంఎస్‌కు రూ. 10వేల దాకా పెనాల్టీ ఆ తరువాత కూడా ఉల్లంఘన కొనసాగితే, సంబంధిత ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌లను రెండేళ్లపాటు బ్లాక్‌ చేయనుంది. 

‘‘టెలికం చందాదారులు ప్రమోషనల్‌ ఎస్‌ఎంఎస్‌లు రాకుండా ఉండేందుకు ‘ఎస్‌ఎంఎస్‌ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి 1909’కు పంపించాలి. దీంతో లావాదేవీల సమాచారం మినహా అన్ని రకాల ప్రమోషనల్‌ ఎస్‌ఎంఎస్‌లు రాకుండా బ్లాక్‌ చేయడం జరుగుతుంది’’అని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) తన నోటీస్‌లో పేర్కొంది. కేంద్ర స్థాయిలో టెలికం శాఖ ఒక డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ను (డీఐయూ) ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, లైసెన్స్‌డ్‌ సర్వీస్‌ ప్రాంతంలోని క్షేత్రస్థాయి యూనిట్లలో టెలికం అనలైసిస్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ (టీఏఎఫ్‌సీవోపీ)ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నాయి.  

జరిమానాలు.. 
ట్రాయ్‌ విడుదల చేసిన నోటీస్‌ ప్రకారం.. రిజిస్టర్డ్‌ టెలీ మార్కెటర్‌ నుంచి అవాంఛనీయ వాణిజ్య సమాచారం వినియోగదారులకు వెళితే పలు రకాల పెనాల్టీలను విధించనున్నారు. తొలుత రూ.1,000 జరిమానాతో సరిపెట్టి.. ఆ తర్వాత నిబంధన ఉల్లంఘనకు రూ.5,000 చొప్పున జరిమానా విధించడంతోపాటు.. కనెక్షన్‌ రద్దు చేయడానికి సంబంధించి హెచ్చరిక జారీ అవుతుంది. మూడో ఉల్లంఘనను గుర్తిస్తే రూ.10,000 జరిమానాతోపాటు కనెక్షన్‌ను కూడా రద్దు చేయనున్నారు. ఇక నమోదు చేసుకోని టెలీమార్కెటర్‌ నుంచి అవాంఛనీయ కాల్‌ లేదా సందేశం వస్తే.. సంబంధిత టెలికం కనెక్షన్‌ను గుర్తిస్తారు. రోజుకు 20 కాల్స్, 20ఎస్‌ఎంఎస్‌ల పరిమితి అమల్లోకి వస్తుంది. గుర్తింపు ధ్రువీకరణ పూర్తయ్యే వరకూ డేటా వినియోగానికి అవకాశం ఉండదు. సిమ్‌లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను టెలికం కమర్షియల్‌ కమ్యూనికేషన్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ గైడ్‌లైన్స్‌ 2018 కింద అమలు చేయాల్సి ఉంటుందని ట్రాయ్‌ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top