ఈ ఏడాదీ వాణిజ్య వాహనాల జోరు

Domestic commercial vehicle industry volumes to grow 7-10percent in FY24 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా వాణిజ్య వాహన పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–10 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోళ్లు, గనులు, మౌలిక రంగంలో నిర్మాణ కార్యకలాపాలు, ఆరోగ్యకర స్థాయిలో వినియోగం ఈ వృద్ధికి దోహదం చేస్తుంది. వాస్తవానికి గత నెలలో విక్రయాలు 2022 ఏప్రిల్‌తో పోలిస్తే 5 శాతం, ఈ ఏడాది మార్చితో పోలిస్తే 41 శాతం క్షీణించాయి.

2022–23లో పరిశ్రమ పరిమాణం 33 శాతంపైగా దూసుకెళ్లింది. అనుకూల విక్రయాల స్థాయితో పాటు స్థూల ఆర్థిక కార్యకలాపాలలో బలమైన వృద్ధి ఇందుకు దోహదం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన ఆరోగ్యకర డిమాండ్‌ను 2023–24 అనుసరిస్తుంది. మార్చి 2021లో ప్రకటించిన స్క్రాపేజ్‌ విధానం 2023 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చింది. కొత్త వాణిజ్య వాహనాల అమ్మకాల పెరుగుదలకు ఈ పాలసీ దోహదపడే అవకాశం ఉంది’ అని ఇక్రా వివరించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top